Ravneet Bittu: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నాయకుడు కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దేశంలో నెం.1 టెర్రరిస్టు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని బిట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా భారత దేశంలోని సిక్కుల గురించి ఉద్దేశించి మాట్లాడారు. ఇండియాలో సిక్కులకు మత స్వేచ్ఛ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. రాహుల్ మాటలపై బీజేపీతో పాటు, కొందరు సిక్కులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పలువురు సిక్కులు సోనియా గాంధీ ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రవనీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశానికి రాహుల్ గాంధీ పెద్ద శత్రువు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఉగ్రవాదులు కూడా సపోర్ట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా బాంబుల తయారీకి అతను మద్దతు ఇస్తున్నాడంటూ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీంతో కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు సెక్షన్ 353(2), 192, 196 ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లర్లు సృష్టించడం, మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. మత సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించడం తదితర అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.