Rohini Acharya : బూతులు తిట్టారు, చెప్పుతో కొట్టబోయారు.. లాలూ కూతురు సంచలన ఆరోపణలు!

లాలూ కుమార్తె, తేజస్వి యాదవ్ సోదరి అయిన రోహిణీ ఆచార్య తన సొంత కుటుంబం, ముఖ్యంగా తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహిత సహాయకులపై తీవ్రమైన, సంచలన ఆరోపణలు చేశారు.

New Update
lalu

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. లాలూ కుమార్తె, తేజస్వి యాదవ్ సోదరి అయిన రోహిణీ ఆచార్య తన సొంత కుటుంబం, ముఖ్యంగా తన సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహిత సహాయకులపై తీవ్రమైన, సంచలన ఆరోపణలు చేశారు. రోహిణి ఆచార్య తాను రాజకీయాలను వీడుతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. "నాకు కుటుంబం లేదు. మీరు వెళ్లి సంజయ్ యాదవ్, రమీజ్, తేజస్వి యాదవ్‌లను అడగండి. వారే నన్ను కుటుంబం నుండి బయటకు గెంటేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చెప్పు కూడా ఎత్తారని

పార్టీ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమిపై తాను ప్రశ్నించినందుకు, తనపై అసభ్యకరమైన తిట్లు  కురిపించారని, అవమానించారని, కొట్టబోయారని, చివరికి చెప్పు కూడా ఎత్తారని ఆమె ఆరోపించారు. పార్టీ ఓటమికి గల కారణాలు, ముఖ్యంగా తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ పాత్ర గురించి ప్రశ్నించినప్పుడు, ఈ దాడి జరిగిందని ఆమె తెలిపారు.

"వారు ఏ బాధ్యత తీసుకోదలచుకోలేదు. పార్టీ ఇలా ఎందుకు విఫలమైందని దేశం మొత్తం అడుగుతోంది. సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు చెప్పగానే నన్ను ఇంటి నుండి బయటకు గెంటేశారు, అవమానించారు, బూతులు తిట్టారు, కొట్టబోయారు," అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం చవిచూసింది. 140కి పైగా స్థానాల్లో పోటీ చేసినా కేవలం 25 సీట్లకే పరిమితమైంది. ఈ దారుణ ఫలితాల తర్వాత తేజస్వి నాయకత్వంపై, అలాగే ఆయన నిర్ణయాలపై సంజయ్ యాదవ్ వంటి బయటి వ్యక్తుల ప్రభావంపై కుటుంబంలో విభేదాలు తీవ్రమయ్యాయి. రోహిణి ఆచార్య బహిష్కరణ కంటే ముందు, ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా అంతర్గత వివాదాల కారణంగా గతంలో పార్టీ,కుటుంబం నుండి బహిష్కరించబడ్డారు.

Advertisment
తాజా కథనాలు