Nori Dattatreyudu: క్యాన్సర్‌పై పోరాటం...డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మ పురస్కారం..ఆయన గురించి తెలుసా?

క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులను సకాలంలో గుర్తిస్తే దాన్ని నిర్మూలించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించడంతో పాటు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది.

New Update
FotoJet (11)

Nori Dattatreyudu

Nori Dattatreyudu:  క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులను సకాలంలో గుర్తిస్తే దాన్ని నిర్మూలించడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించడంతో పాటు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఎనలేని సేవలు అందిస్తున్న ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఆయను పద్మభూషణ్ లభించింది. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగంలో హెడ్ గా పనిచేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన ఆయన మహిళల్లో క్యాన్సర్ చికిత్సలో నిపుణుడిగా పేరు పొందారు. అలాగే, బసవతారకం ఆసుపత్రి ఏర్పాటులో ఆయనది  కీలక పాత్ర. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ చికిత్స సేవలకు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నుంచి ‘ట్రిబ్యూట్ టు లైఫ్‌’ గౌరవం అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. ఇప్పుడు ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించింది. ఆయనది కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రాంతంలోని మంటాడ గ్రామం. 

నోరి దత్తాత్రేయుడు మంటాడ గ్రామంలో కనకదుర్గ,సత్యనారాయణ దంపతులకు1947 అక్టోబరు 21న జన్మించారు. అలాగే కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరులో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఉన్నత, పీయూసీ, బీఎస్సీ విద్యను మచిలీపట్నంలోని జైహింద్‌ హైస్కూల్, ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తిచేశారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్‌ పట్టా తీసుకున్న ఆయన... ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. 1962లో ప్రీ–యూనివర్సిటీ, 1965లో బీఎస్సీ, ఉస్మానియాలో ఎండీ చేసినప్పుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందారు.

అనంతరం ఫిబ్రవరి 1972 నుంచి ఏడాదిపాటు గాంధీ ఆస్పత్రిలో పనిచేశారు. 1973 నుంచి 1976 వరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడు నోరి దత్తాత్రేయుడు. ఆయన నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్‌ ఆంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదగడం విశేషం. క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించి నాలుగు పుస్తకాలు, 200లకు పైగా పేపర్‌ ప్రజెంటేషన్లు చేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ప్రెస్‌ బైటేరియన్‌ హాస్పిటల్‌లో రేడియేషన్‌ ఆంకాలజీ విభాగం వైస్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.  కేవలం 8 డాలర్లతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ఆయన ఈనాడు ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకున్నారు.

వైద్య ప్రపంచంలో డాక్టర్‌ నోరి బ్రాకీ థెరపీని పరిచయం చేశారు. అప్పట్లో క్యాన్సర్‌ చికిత్స అంటే శరీరమంతా రేడియేషన్‌ ఇచ్చేపద్ధతి ఉండేది. కానీ, డాక్టర్‌ నోరీ క్యాన్సర్‌ ఉన్న కణతి దగ్గరే రేడియో థార్మిక పదార్థాలను ఉంచి చికిత్స చేసే వినూత్న పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు లక్షలాది మంది  ప్రాణాలను కాపాడాయి. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ బ్రాకీ థెరపీ విధానానికి ఆయన్నే ఆద్యుడు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని గౌరవాలు పొందినా తన సొంతగడ్డపై ప్రేమను మరిచిపోలేదు. హైదరాబాద్‌లోని ఇండో - అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి స్థాపనలో ఆయన కృషి మరవలేనిది. ఏఐ సాయంతో క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించే సాంకేతికతను భారత్‌కు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తూ.. ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఎన్నో అంతర్జాతీయ అవార్డులు..

క్యాన్సర్‌ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన నోరి దత్తాత్రేయుడిని అనేక అవార్డులు వరించాయి.  


- 1984లో అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ వారు క్లినికల్‌ ఫెలోషిప్‌ ఫ్యాకల్టీ అవార్డు ఇచ్చారు.  
-1990లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ రేడియేషన్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.  
-1994లో అలూమిని సొసైటీ, మెమోరియల్‌ స్లాన్‌–కెటరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌ డిస్టింగ్విష్డ్‌ అలునినస్‌ అవార్డు  అందుకున్నారు.  
- 2000లో ఇప్పటివరకు కాస్టల్‌ అండ్‌ కానల్లే పబ్లికేషన్‌ వారి అమెరికా బెస్ట్‌ డాక్టర్, లేడీస్‌ హోం జర్నల్‌ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్‌ నివారణలో ఉత్తమ డాక్టర్‌గా ఎంపిక.  

- 2014లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం.. ఎల్లిస్‌ ఐలాండ్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌. 
- 2015లో భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ 
- 1995లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు.  
- 2003లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ రేడియేషన్‌ ఆంకాలజీ ఫెలోషిప్‌ అందుకున్నారు. 

- అనేక ఏళ్లుగా అమెరికాలో క్యాన్సర్‌ బాధితు­ల­కు అందిస్తున్న ఉన్నత సేవలకుగాను అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ నోరి దత్తాత్రేయుడికి ‘ట్రిబ్యూట్‌ టు లైఫ్‌’ గౌరవంతో సత్కరించింది.  

-మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటి ప్రముఖులకు నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్‌ చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పద్మభూషణ్‌ రావడంపట్ల కేఎంసీ పూర్వ విద్యార్థులు, వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు