ప్రజా మేధావి.. సాయిబాబా ఎప్పటికీ సజీవుడే!

ప్రజా మేధావి, మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబా మరణం దేశాన్ని కదిలించింది. జీవితమంతా సమాజాన్ని చదువుతూనే ఉద్యమాల ఉపాధ్యాయుడిగా సాయిబాబా నడిచిన దారి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. 

New Update
dserete

Prof GN Saibaba: ప్రజా మేధావి, మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, కామ్రేడ్ జి.ఎన్ సాయిబాబా మరణం దేశాన్ని కదిలించింది. జీవితమంతా సమాజాన్ని చదువుతూనే ఉద్యమాల ఉపాధ్యాయుడిగా సాయిబాబా నడిచిన దారి అందరికీ దీపస్తంభం. సాయి ఈ కాలంలో మానవ విలువలను ప్రభావితం చేయగల ఒక లివింగ్ లెజెండ్. చక్రాల బండిలో చక్ర భ్రమణం పొందే జ్ఞాపకాలలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తీరు, సాయిబాబా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రెండుకాళ్ళు లేకున్నా, జైల్లో అనారోగ్యంతో చేతులు కూడా పని చేయని స్థితిలోనూ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ తీరు సాయిబాబాను చరిత్రలో చిరకాలం నిలిచేలా చేసింది.

అమలాపురం టూ ఢిల్లీ యూనివర్సిటీ..


ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన సాయిబాబా చిన్నప్పటి నుంచి బాగా తెలివైన విద్యార్థి. అమ్మ సూర్యవతి తనకు తగినట్లు అవసరమయిన ఏర్పాట్లు చేసేది. అమలాపురంలోనే బీఏ ఇంగ్లిష్ డిగ్రీ పూర్తిచేశాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్, సీఫెల్ (సీఐఇఎఫ్ఎల్)లో డిప్లొమా, ఎంఫిల్ చదివారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా 2013లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అయితే సాయిబాబా చదువంతా స్కాలర్ షిప్ లపై కొనసాగింది. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా సాయిబాబా ప‌ని చేశారు.

విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాల్లోకి.. 


ఇక డిగ్రీ చదువుతున్న సయమంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు. 1992లో హెచ్ సీయూలో ఏఐఆర్‌పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శిగా నియమితులై ఆయన.. 1995లో ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌డీఎఫ్, విరసం సంస్థలోనూ పని చేశారు. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణ అని సాయిబాబా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు.  

దేశద్రోహాం కేసు.. 
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. దీంతో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలవగా.. 2021లో ఢిల్లీ యూనివర్సిటీ పూర్తిగా విధుల నుంచి తొలగించింది. ఈ  క్రమంలోనే 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మొత్తంగా సాయిబాబా 2014 నుంచి 2024 మార్చి 6వ వరకు నాగ్‌పూర్ జైల్లోనే ఉండగా ఈ యేడాది మార్చి 7న నిర్దోషిగా విడుదలయ్యారు.

అత్యంత క్రూరమైన నేరస్థుడిగా..
అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే సెల్‌లో తనను ఉంచారని, అందులో కనీసం వీల్ చైర్‌ తిరిగే పరిస్థితి కూడా ఉండేది కాదని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎంతో జీవితాన్ని కోల్పోయాను.. పాఠాలు చెప్పిన‌ట్లు క‌ల‌లు వ‌చ్చేవి. ఈ పదేళ్లలో నా స్టూడెంట్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. తరగతులకు దూరమయ్యాను. జైల్లో ఉన్నా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు, వారితో మాట్లాడుతున్నట్లు కలలు వచ్చేవి' అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఏళ్ల తరబడి జైల్లో బంధించి తన శక్తిని మొత్తాన్ని నాశనం చేసి.. చావు దశలో ఆయన ఏ నేరం చేయలేదని నిర్దోషిగా బయటికి వదిలారంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు. 'ఇది రాజ్య అహంకార ధోరణి. మీ చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు.. పుస్తకాలలో మనుషుల హృదయాలలో పదిలంగా ఉంటుంది' జోహార్ కామ్రేడ్ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. 

అసత్యాల చెరసాల.. 
సాయిబాబా రాసిన రచనలు, కవిత్వం కూడా సమాజంపై ప్రభావం చూపింది. 'ఒంటరి జైలుగది ఇనుప చువ్వల వెనుక పగలూ రాత్రి నేనొక తరగతి గదిని కలగంటాను. మీ నుండి దూరంగా ఖైదు చేయబడినా నరాలలో రక్త నాళాలలో పరుగులెత్తుతున్న స్వేచ్చా కాంక్ష నుండి సంకెళ్లు లేని మనోనేత్రం నుండి నేను మిమ్మల్ని చూస్తాను.. మాట్లాడతాను. నా బలహీనమైన చేతులతో బోధించడం నా బలం నా ఊపిరి.. నా జీవితం. బాధలు కన్నీళ్లు ఆశయాలు భయాల బాధామయ చరిత్రతో తాత్వికతతో అర్థశాస్త్రంతో మనల్ని కలిపి ఉంచే సారస్వతాన్ని రేపటి ఉదయంకోసం హత్తుకుంటాను' అంటూ తన వేదనను రచన రూపంలో బయటపెట్టారు. 'నేను చనిపోవడానికి నిరాకరించినపుడు నా సంకెళ్లు వదులు చేసారు నేను విశాలమైన మైదానాల్లోకి గడ్డి పూలవైపు చిరునవ్వులు చిందిస్తూ వచ్చాను నా దరహాసం వాళ్ళకు అసహనం కలిగించింది. వాళ్ళు నాకు మళ్ళీ గొలుసులు వేసారు' అంటూ తన సహచరి వసంతకు రాసిన లేఖలు సైతం మేధావులతోపాటు సామాన్యులను కదిలించాయి. 

గోర్కీ అమ్మలాగానే సూర్యవతమ్మ.. 
సాయిబాబా తల్లి సూర్యవతి పిలల్ల చదువు విషయంలోనే కాదు.. సామాజిక బాధ్యతగా చేస్తున్న పనులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.   నిరుత్సాహ పరచలేదు. ఆ క్రమంలోనే ప్రజా సంఘాలవారు అందరూ సూర్యవతి గారికి దగ్గరయ్యారు. పిల్లలూ, కోడళ్ళూ ప్రజా సంఘాలలో భాగమయితే తానూ సహకరిస్తూ పరోక్షంగా మద్ధతుగా నిలిచింది. ప్రజా ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా  పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే.. కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు పూనుకున్న గోర్కీ అమ్మలాగానే సూర్యవతమ్మ అందరికి అమ్మ అయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు