2వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీధి కుక్క.. శాంతి యాత్రలో అలోక స్పెషాలిటీ!

సోషల్ మీడియాలో ఓ ఇండియన్ స్ట్రీట్ డాగ్ వైరల్ అవుతోంది. సాధారణంగా వీధి కుక్కలంటే మనం ఈజీగా దాటిపోతాం, కానీ 'అలోక' అనే కుక్క మాత్రం శాంతి దూతగా మారి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. బౌద్ధ భిక్షువులతో కలిసి చేస్తున్న 'శాంతి యాత్ర' అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

New Update
aloka

సోషల్ మీడియాలో ఓ ఇండియన్ స్ట్రీట్ డాగ్ వైరల్ అవుతోంది. సాధారణంగా వీధి కుక్కలంటే మనం ఈజీగా దాటిపోతాం, కానీ 'అలోక' అనే కుక్క మాత్రం శాంతి దూతగా మారి వేల కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. బౌద్ధ భిక్షువులతో కలిసి అది చేస్తున్న 'శాంతి యాత్ర' అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మనుషులకే సాధ్యం కాని సుదీర్ఘ పాదయాత్రను ఒక మూగజీవి ఎంతో నిబద్ధతతో చేస్తోంది. థాయిలాండ్‌కు చెందిన సుమారు 100 మంది బౌద్ధ భిక్షువులు భారతదేశంలోని వివిధ బౌద్ధ క్షేత్రాలను సందర్శిస్తూ చేపట్టిన 'శాంతి యాత్ర'లో 'అలోక' అనే కుక్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

దాదాపు మూడు నెలల క్రితం బౌద్ధ భిక్షువుల టీం ఉత్తర భారతదేశంలోని ధర్మశాల సమీపంలో తమ యాత్రను ప్రారంభించింది. యాత్ర మొదలైన కొన్నిరోజులకే ఒక వీధి కుక్క (అలోక) బౌద్ధ భిక్షువుల వెంట తిరగడం ప్రారంభించింది. మొదట్లో భిక్షువులు అది కేవలం ఆహారం కోసం వస్తోందని భావించినా, అది వారితో పాటే కిలోమీటర్ల కొద్దీ నడవడం చూసి ఆశ్చర్యపోయారు.

అలోక - శాంతి చిహ్నం

భిక్షువులు ఆ కుక్కకు 'అలోక' అని పేరు పెట్టారు. అలోక అంటే 'కాంతి' అని అర్థం. ఈ కుక్క కేవలం వారితో నడవడమే కాదు, భిక్షువుల జీవనశైలికి అలవాటు పడిపోయింది. భిక్షువులు ఉదయాన్నే యాత్ర ప్రారంభించినప్పుడు వారితో పాటే లేస్తుంది. వారు విశ్రాంతి తీసుకునేటప్పుడు వారి పక్కనే కూర్చుంటుంది. భిక్షువులకు ఇచ్చే శాఖాహారన్నే అది కూడా తింటోంది. ఇప్పటికే అలోక సుమారు 2,000 కిలోమీటర్లకు పైగా నడిచింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా మీదుగా ప్రస్తుతం బీహార్‌లోని బోధ్ గయ వైపు సాగుతోంది.

ఈ శాంతి యాత్ర ఏ గ్రామం గుండా వెళ్తున్నా, ప్రజలు భిక్షువులతో పాటు అలోకను కూడా ఎంతో భక్తితో చూస్తున్నారు. దానికి పూలదండలు వేసి, ఆహారం అందిస్తున్నారు. వందల మంది మనుషుల మధ్య ఎంతో ప్రశాంతంగా, ఏ మాత్రం భయం లేకుండా అలోక నడుస్తున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "నిజమైన శాంతికి, భక్తికి భాషతో గానీ, రూపంతో గానీ సంబంధం లేదని అలోక నిరూపిస్తోంది" అని యాత్రలోని భిక్షువులు చెబుతున్నారు. బౌద్ధ ధర్మంలోని కరుణ, అహింస సిద్ధాంతాలకు అలోక ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. యాత్ర ముగిసిన తర్వాత అలోకను ఎక్కడికి తీసుకెళ్తారనేది ఇంకా తెలియకపోయినా, ఈ మూగజీవి ప్రయాణం మాత్రం మానవత్వానికి, జంతువుల ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.

Advertisment
తాజా కథనాలు