/rtv/media/media_files/2026/02/15/mp-renuka-2026-02-15-21-44-16.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరికి బిగ్ షాక్ తగిలింది. ఆమెకు పార్లమెంటు సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ప్రాంగణంలోకి కుక్కను తీసుకురావడమే కాకుండా, ఎంపీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమె వివరణ కోరింది. ఈ నెల 23వ తేదీలోగా ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని కమిటీ ఆదేశించింది.
గత డిసెంబరులో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తన కారులో ఒక వీధి కుక్కను పార్లమెంట్ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, లోపల కూర్చున్న వారే కరుస్తారు, కుక్కలు కరవవు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎంపీలు బ్రిజ్ లాల్, ఇందు బాలా గోస్వామి.. ఆమెపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, అలాగే భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై గత వారం సమావేశమైన సభా హక్కుల కమిటీ, ఆమె నుంచి రాతపూర్వక వివరణ కోరాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా, ఆమె మరింత వ్యంగ్యంగా "భౌ భౌ.. ఇంకేం చెప్పాలి?" అని సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, తాను దారిలో గాయపడిన కుక్కను రక్షించి తీసుకువచ్చానని, జంతువుల పట్ల ప్రభుత్వానికి ప్రేమ లేదని ఆమె అప్పట్లో వాదించారు. ప్రస్తుతం ఈ నోటీసులపై స్పందిస్తూ.. పార్లమెంటరీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా సమాధానం ఇస్తామని ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Follow Us