/rtv/media/media_files/2025/12/31/vi-2025-12-31-17-52-08.jpg)
కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం 2025 చివరి రోజున గొప్ప కానుకను అందించింది. కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను రూ.87,695 కోట్లకు పరిమితం చేస్తూ, వాటి చెల్లింపు గడువును భారీగా పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నిలిపివేసిన రూ.87,695 కోట్ల బకాయిలను కంపెనీ ఇప్పుడు వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. వీటిని 2032 ఆర్థిక సంవత్సరం నుండి 2041 వరకు అంటే పది సంవత్సరాల కాలంలో వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.
సుమారు రూ.18,000 కోట్ల విలువైన తక్షణ చెల్లింపులపై 5 ఏళ్ల పాటు మారటోరియం (వాయిదా) విధించారు. ఇది కంపెనీకి తక్షణం నగదు లభ్యత పెంచుకోవడానికి సహాయపడుతుంది. టెలికాం విభాగం ఈ బకాయిల మొత్తాన్ని ఆడిట్ నివేదికల ఆధారంగా మరోసారి సమీక్షించనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల బకాయిల మొత్తం మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. కంపెనీ మనుగడ సాగిస్తేనే ప్రభుత్వ పెట్టుబడికి భద్రత ఉంటుంది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది Vi వినియోగదారులు ఉన్నారు. కంపెనీ మూతపడితే వీరి సేవలకు అంతరాయం కలగడమే కాకుండా, టెలికాం రంగంలో పోటీ తగ్గి జియో, ఎయిర్‌టెల్‌ల ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉంది. టెలికాం రంగంలో కనీసం మూడు ప్రైవేట్ సంస్థలు ఉండటం దేశ డిజిటల్ పురోగతికి, ఆరోగ్యకరమైన పోటీకి అవసరమని ప్రభుత్వం భావించింది.
అయితే, 2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే ఖరారు చేసిన బకాయిలలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ మొత్తాన్ని మాత్రం కంపెనీ 2026 నుండి 2031 మధ్య యధావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వొడాఫోన్ ఐడియాకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. ఈ ఉపశమనంతో సంస్థ కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు, 5G సేవలను విస్తరించేందుకు మార్గం సుగమం కానుంది.
Follow Us