'ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు నేను దేవుడిని చాలా సార్లు తిట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడెలా స్మరిస్తాను..' ఉరికంబంపై ఉన్నప్పుడు దేవుడిని తలచుకోమంటే భగత్‌సింగ్ చెప్పిన మాట ఇది! ఆయన్ను అందరూ ఓ విప్లవకారుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగానే చూస్తారు కానీ ఆయన భావజాలం గురించి మాత్రం చర్చించరు. తుదిశ్వాస వరకు భారతీయ సమాజంలో పెరుగుతున్న మతతత్వ స్వభావాన్ని విమర్శించిన నాస్తిక భగత్‌సింగ్ గురించి ఎన్నో విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. అందులో ప్రధానమైనది గాంధీ వర్సెస్ భగత్‌సింగ్! ఈ ఉక్కు గుండెల వీరుడి ఉరిని ఆపే అవకాశం గాంధీకి వచ్చిందని.. అయినా ఆయన మాత్రం ఆ పని చేయాలేదన్న వాదన ఉంది. ఇంతకీ ఇందులో నిజమెంత?
క్షమాభిక్ష పిరికివారి చర్య:
గాంధీ, భగత్‌సింగ్ అంతిమ లక్ష్యం ఒకటే! అది బ్రిటిష్ బానిస సంకేళ్లను తెంచడం! అయితే లక్ష్యాన్ని సాధించే మార్గాలు మాత్రం భిన్నం. నాటి జాతీయవాదానికి గాంధీజీ సూర్యుడైతే.. భగత్ సింగ్ తనదైన కక్ష్యను అనుసరించే నక్షత్రమని చరిత్రకారులు చెబుతుంటారు. భగత్‌సింగ్ పోరాటపంథా వేరు.. ఆయన పోరాటంలో అపారమైన జ్ఞానముంటుంది. స్వచ్ఛమైన ప్రేముంటుంది. మనుషులందరూ సమానమేనన్న భావనుంటుంది. అందుకే మిగిలిన స్వతంత్ర్య సమరయోధులు వేరు.. భగత్‌సింగ్ వేరు..! క్షమాభిక్ష కోసం ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి జైలు నుంచి బయటకు వచ్చిన నాటి దేశభక్తులు కొందరైతే.. క్షమాభిక్ష అవకాశమున్నా తిరస్కరించి ఉరి కొయ్యను ముద్దాడిన యోధుడు భగత్‌సింగ్.
చెవిటి వారికి వినబడాలంటే శబ్దం బిగ్గరగా ఉండాలి:
1927లో సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచి నేలకొరిగారు. దీనికి కారణమైన బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ సాండర్స్‌ను భగత్‌సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురు చంపారు. దీంతో ఈ ముగ్గురికి మరణశిక్ష విధించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు. ఇక 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీపై బతుకేశ్వర్ దత్‌తో కలిసి భగత్‌సింగ్ బాంబులు విసిరారు. అక్కడే నిలబడి విప్లవాత్మక నినాదాలు చేశారు. చుట్టూ కరపత్రాలు విసిరారు. తప్పించుకునే అవకాశమున్నా పోలీసులకు లొంగిపోయారు. ఆ సమయంలో భగత్ సింగ్ చేసిన 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదం దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ దద్దరిల్లింది. భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చింది. బ్రిటిష్‌పాలకులకు చెమటలు పట్టించింది. చెవిటి వారికి వినబడాలంటే శబ్దం చాలా బిగ్గరగా ఉండాలన్న భగత్‌సింగ్ మాట అక్షర సత్యమైంది.
గాంధీకి వచ్చిన అవకాశం:
ఇక భగత్ సింగ్ అరెస్ట్ వార్త నాడు దేశాన్ని కదిలించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించడం వల్ల ఉరిశిక్షను ఆపవచ్చని నాడు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే క్షమాభిక్షను భగత్‌సింగ్ వ్యతిరేకించారు. అసలు ఇది పిరికివారి చర్యగా అభివర్ణించారు. అయితే క్షమాభిక్ష ద్వారా కాకుండా భగత్‌సింగ్‌ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం నాడు గాంధీకి వచ్చింది. నిజానికి భగత్‌సింగ్ జైలులో ఉన్న సమయంలో గాంధీ కూడా జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత జనవరి 26, 1931న గాంధీ జైలు నుంచి విడుదలయ్యారు.
గాంధీ ఎందుకిలా చేశారు?
నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో రాజీ చేసుకోవాలని నాడు గాంధీ నిర్ణయించుకోవడం పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపింది. ఈ ఇద్దరి ఒప్పందంలో భాగంగా గాంధీ తన సత్యాగ్రహ దీక్షను విరమించుకోవాలి.. అటు రాజకీయ ఖైదీలను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయాలి. ఇదే సమయంలో భగత్‌సింగ్ ఉరి గురించి ఇర్విన్‌తో గాంధీ చర్చిస్తారని అంతా భావించారు. అయితే గాంధీ మాత్రం భగత్‌సింగ్ ఉరిని ఆపమని కోరలేదు. అసలు ఈ సమావేశంలో భగత్‌సింగ్ గురించి చర్చ అవసరం లేదని ఇర్విన్‌కు చెప్పారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులను మీరు మరింత అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే, భగత్ సింగ్ ఉరిని తాత్కాలికంగా నిలిపివేయాలని మాత్రమే గాంధీ కోరారు.
ఇందులో శాంతి ఎక్కడుంది?
భగత్‌సింగ్ ధైర్యాన్ని ఓవైపు ప్రశంసిస్తూనే గాంధీ చేసిన ఈ పని నాడు సుభాష్ చంద్రబోస్‌తో పాటు కాంగ్రెస్ నేతలకు సైతం ఆగ్రహాన్ని తెప్పించింది. దేశభక్తుల తలలపై ఉరి వేలాడుతున్నప్పుడు శాంతి ఎలా ఉంటుందని గాంధీని నిలదీస్తూ యువత కరపత్రాలు పంచింది. అయితే గాంధీ మాత్రం తన ఆలోచనను మార్చుకోలేదు. నిజానికి గాంధీ-ఇర్విన్ ఒప్పందం గాంధీ స్థాయిని పెంచింది. ఎందుకంటే మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లు శాంతి నిబంధనల పరిష్కారం కోసం కాంగ్రెస్‌తో సమాన స్థాయిలో చర్చలు జరిపారు. కానీ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును ఉరితీయడం గాంధీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఎందుకంటే భగత్‌సింగ్ ఉరిని ఆపడంలో వైస్రాయ్‌ని ఒప్పించగలగే అవకాశం గాంధీకి ఉన్నా ఆ పని చేయలేదు.
ఇంక్విలాబ్ జిందాబాద్..:
114 రోజులు నిరాహార దీక్ష చేసి, నిర్బంధంలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించిన భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురును మార్చి23, 1931రాత్రి 7:30గంటల నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వరుసగా నిల్చో బెట్టి ఉరితీసింది. ఉరికొయ్య ముందు నిలబడినప్పుడు కూడా ఆ ముగ్గురూ ఏ మాత్రం వణకలేదు. తుదిశ్వాస విడవడానికి ముందు చివరిసారిగా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ వారు ఇచ్చిన నినాద ధైర్యమే నేడు ప్రవాహంలా మారి నేటితరాలకు చేరింది.