/rtv/media/media_files/2025/07/26/dead-body-missing-2025-07-26-16-13-44.jpg)
ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మృతదేహాలు కనిపించకుండా పోయినట్లుగా వారు ఆరోపించారు. ఇందులో లక్ష్మీప్రియ బెహెరా, సత్యభామ పరిడా, శత్రుఘ్న దాస్, ప్రమీలా దాస్ మృతదేహాలు ఉన్నాయని సమాచారం.
చేతబడుల కోసం వాడుతున్నారా?
ఈ సంఘటనల వెనుక అక్రమంగా అవయవాలను సేకరించి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సరఫరా చేసే ముఠా ప్రమేయం ఉండవచ్చునని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ మృతదేహాలను చేతబడుల కోసం తీసుకెళ్తున్నారని కూడా అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనల వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రిపూట శ్మశానవాటిక వైపు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు.
ఇంతకు ముందు కూడా పలు ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.శ్మశానవాటికలో ఖననం చేయబడిన 10 రోజుల తర్వాత నా తల్లి మృతదేహం కనిపించడం లేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని స్థానికుడు తపస్ సమల్ అన్నారు. తాజాగా మరో నాలుగు మృతదేహాలు కనిపించకుండా పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టిస్తోంది.