Telangana Elections 2023: దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో చూసింది ట్రైలర్ మాత్రమే అని, అసలైన సినిమా ముందుందని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగిన సమావేశంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. తెలుగులో మాట్లాడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. గతంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాదిరిగానే కేసీఆర్ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారని, సీఎం కేసీఆర్ సచివాలయానికీ వెళ్లరని విమర్శించారు. పదిహేనేళ్ల క్రితం ఇదే రోజున ముంబైలో జరిగిన దాడిని గుర్తు చేస్తూ అసమర్థ నాయకులు పాలిస్తే జరిగే పరిణామాలను గతంలోనే దేశం చవిచూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, అవి రెండూ స్కాముల్లో పోటీ పడతాయన్నారు.
ఇది కూడా చదవండి: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? డోంట్ వర్రీ డౌన్లోడ్ చేసుకోండిలా
బీజేపీ అధికారం సాధించిన వెంటనే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామన్న మోదీ, అన్నేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఎంతమంది బీసీలకు సీఎం పదవి ఇచ్చిందని ప్రశ్నించారు. బీజేపీతోనే తెలంగాణ గౌరవం పెరుగుతుందన్నారు. మంత్రిమండలిలో కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తామని, సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. రైతుల గురించి ఆలోచించే పార్టీ కూడా బీజేపీ ఒకటే అన్నారు.
మాదిగలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాం:
తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ గుర్తించిందని, వర్గీకరణ కోసం ఒక కమిటీ వేసి మాదిగలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. దశాబ్ధాలుగా వర్గీకరణ కోసం మాదిగలు చేస్తున్న పోరాటాన్ని బీజేపీ గుర్తించిందన్నారు. అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభ అనంతరం తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పు వచ్చిందని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.