Nara Lokesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. లోకేష్‌తో పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేత వంటి అంశాలను రాష్ట్రపతికి వివరించారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారని ఫిర్యాదు చేశామని తెలిపారు. యువతగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించగానే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను ఇరికించారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. రోజుకో కేసుతో తమను వేధిస్తున్నారని.. తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని లోకేష్ వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్.. చంద్రబాబు కేసుల విషయమై న్యాయవాదులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. అలాగే టీడీపీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలకు పార్టీ కార్యక్రమాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్నారు సీఐడీ అధికారులు. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ ఈ రోజు మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ యాత్రను వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందే లోకేష్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: లోకేష్ ఫోన్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం: కేటీఆర్