lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టులో టీడీపీ యువనేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు యువగళం పాదయాత్రకు లోకేష్ రెడీ అవుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి పాదయాత్ర ఆగిపోయింది. ఓవైపు పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండటంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయిన లోకేష్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో లోకేష్ యువగళాన్ని ప్రారంభించనున్నారు.
చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. ఇటు యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని లోకేష్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేష్ పేరు చేర్చడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.