నారా లోకేష్ కు (Nara Lokesh) ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 4వ తేదీకి బదులుగా ఈ నెల 10న సీఐడీ (AP CID) విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇటీవల తనకు జారీ చేసిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన లోకేష్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని వారు వివరించారు. లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తన వాదనలు వినిపించారు.
ఇది కూడా చదవండి: Chandrababu Updates: చంద్రబాబుతో ములాఖత్.. బాబు ఆరోగ్యంపై చినరాజప్ప కీలక ప్రకటన..
తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, రేపే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. అంత తొందర ఏముందని లోకేష్ తరఫు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన నారా లోకేష్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదిని కూడా అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. విచారణ సమయంలో మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ న్ పై విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఆ రోజునే పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.