ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు(Ap skill development scam case)లో అరెస్ట్ అయిన టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని మంగళవారం ములాఖత్ (Mulakhat) ద్వారా ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. వారిలో ఆయన భార్య నారా భువనేశ్వరి(NaraBhuvaneswari) , కోడలు నారా బ్రహ్మణి (Brahmani) ఉన్నారు. ములాఖత్ అయిన తరువాత నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
నిత్యం ప్రజల కోసం కష్టపడిన వ్యక్తిని , ఏ నేరము చేయని మనిషిని తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఆయన కుటుంబానికంటే కూడా ఎక్కువగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమే ఆయన ఆలోచించేవారని ఆమె తెలిపారు. ఆయనకు ముందు ప్రజలు ఆ తరువాతే కుటుంబం అన్న విషయాన్ని తెలియజేశారు.
ఆయన కట్టించిన బిల్డింగ్ లోనే ఆయన ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారని ఆమె అన్నారు. అసలు ఏమీ లేని కేసులో ఆయనను ఇరికించారని ఆమె ఆరోపించారు. ప్రతి ఒక్క పౌరుడు బయటకు వచ్చి పోరాడలని ఆమె ప్రజలను కోరారు. ఇది చాలా కష్టతరమైన సమయం. ప్రజలందరూ కూడా ఎంతో నిబ్బరంగా ఉండాల్సిన సమయం.
నిత్యం మన కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. టీడీపీ ఎక్కడికీ వెళ్లదు..మా కుటుంబం ఎప్పుడూ కూడా టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటుంది. జైలులో ఉన్నప్పటికీ కూడా నా భర్త ప్రజల గురించే మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగున్నట్లు ఆయన చెప్పారని తెలిపారు. చన్నీటి స్నానం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆయన భోజనం గురించి లోకేష్ చూసుకుంటున్నారని ఆమె వివరించారు.
ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న బ్లాక్ ను గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనే కట్టించారని తెలిపారు. ఇప్పుడు అదే బ్లాక్ ఆయనను కట్టిపడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జైలులో సరైన సౌకర్యాలు లేవని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు మరింత భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. భద్రత విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
స్వయంగా ఏసీబీ న్యాయస్థానమే భద్రత సౌకర్యాలు మెరుగు పరచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా జైలు ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోన్నట్లు కనిపిస్తుందని ఆమె తెలిపారు. జైలుకెళ్లి చంద్రబాబును చూస్తానని నేనెప్పుడూ ఊహించలేదని ఆమె భావోద్వేగానికి గురైయ్యారు. ఆయనతో మాట్లాడి బయటకు వచ్చేటప్పుడు తన శరీరాన్ని అక్కడే వదిలి వచ్చినట్లు అనిపించిందని ఆమె అన్నారు.