Nandikotkur TDP: నందికొట్కూరు టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ అయిన సందర్భంగా బైరెడ్డి శబరి (Byreddy Shabari) తొలి సారి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది కేడర్. భారీగా ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్య (Gitta Jaya Surya) ఫొటో లేకపోవడం వివాదానికి కారణమైంది. తమ నాయకుడి ఫొటో లేకపోవడంతో జయసూర్య అనుచరుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కావాలనే తమ నేతను పక్కనపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల తర్వాత నందికొట్కూరులో మాజీ మంత్రి భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మళ్లీ యాక్టీవ్ గా మారారు. ఆయన కూతురు శబరి నంద్యాల ఎంపీగా గెలుపొందడం, టీడీపీ అధికారంలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి ఆయన ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరేలా రాజశేఖర్ రెడ్డి వ్యూహాలు రచించారు.
దీంతో నందికొట్కూరు మున్సిపాలిటీ ఇప్పుడు టీడీపీ వశమైంది. ఇటీవల నందికొట్కూరులో పర్యటించిన బైరెడ్డి శబరి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పటేల్ కూడలిలో బైరెడ్డి శబరి బహిరంగ సభ నిర్వహించారు.