Nagari Constituency: ఫైర్ బ్రాండ్ రోజా సైలెన్స్.. టీడీపీ అభ్యర్థి రూల్స్ బ్రేక్.. నగరి రిజల్ట్ మాత్రం సస్పెన్స్! ఏపీలో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో నగరి ఒకటి. మంత్రి రోజా హ్యాట్రిక్ కోసం ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్నికల తరువాత ఫైర్ బ్రాండ్ లాంటి ఆమె సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలు రేపుతోంది. నగరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణ చూడండి. By KVD Varma 26 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nagari Constituency: రెండు రోజులుగా నగరి నియోజకవర్గం మళ్ళీ వార్తల్లోకి వస్తోంది. నగరి.. అనగానే అక్కడ మంత్రి రోజా గుర్తుకువస్తారు. అది ఆమె అక్కడ ఎమ్మెల్యే అయినందుకు కాదు..అటు సినిమాల్లోనూ.. ఇటు టీవీ షో లలోనూ తనదైన ముద్ర వేసి.. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచి.. ఫైర్ బ్రాండ్ గా పాలిటిక్స్ లో దూసుకుపోయిన రోజా తన జీవిత లక్ష్యం అయిన మంత్రి పదవిని వైసీపీ ద్వారా సాధ్యం చేసుకోగలిగారు. ఆమె ఎమ్మెల్యే అయినా.. కాకపోయినా.. రాజకీయాల్లో చేరిన దగ్గర నుంచి తన డైలాగులతో అందరినీ చెడుగుడు ఆడేశారు. టీడీపీలో ఉన్నపుడు వైఎస్సార్ ని ఎలా అయితే తూలనాడారో.. వైసీపీకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడుని అంతకంటే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ని అయితే, ఒక్కోసారి దారుణంగా తన మాటలతో దాడి చేసేవారు. అటువంటి రోజా ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయారు. ఎన్నికల ముందువరకూ రోజా కనిపిస్తే చాలు మైకులు అదిరిపోయేవి. రోజా మాట్లాడుతున్నారు అంటే చాలు యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్ కి కావాల్సిన మేటర్ దొరికేసేది. కానీ, ఎన్నికల తరువాత సీన్ ఎందుకో డల్ అయిపోయింది. నిజానికి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రోజా మాటతీరు మారిపోయినట్టు అనిపించింది. తనను తన సొంత పార్టీవారే ఓడించేందుకు పని చేస్తున్నారంటూ వాపోవడం కనిపించింది. ఆ తరువాత ఎన్నికలు అయిపోయాయి. ప్రజల నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా ఉండిపోయింది. దానితోపాటే నగరి నియోజకవర్గం(Nagari Constituency)లో రోజా నుంచి ఎలాంటి స్పందనా లేదా ప్రకటనలు లేకుండా నిశ్శబ్దం అలుముకుంది. కానీ, ఇప్పుడు నగరిలో రోజాపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, గాలి భానుప్రకాష్ పేరుతొ వెలసిన ఫ్లేక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో మళ్ళీ నగరి నియోజకవర్గం ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చింది. ఎప్పుడూ సొంత పార్టీ వాళ్ళే.. రోజా పరిస్థితి రాజకీయంగా చాలా విచిత్రంగా ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీలో 1998లో చేరిన రోజా.. నగరి (Nagari Constituency)లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆమెకు అక్కడ నుంచి పోటీ చేసినపుడు టీడీపీ మహిళా (మహిళా) అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. ఆమె 2004లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమెతో పాటు పార్టీ కూడా ఓడిపోయింది. ఆ తరువాత ఆమె 2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. ఈ రెండు సందర్భాలలోనూ ఆమె తన సొంత పార్టీ వాళ్ళే అంటే టీడీపీ నేతలే తనను ఓడించారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. తరువాత ఆమె టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ ఆమె వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయన అకస్మాత్తుగా మరణించడంతో.. అటు తరువాత రోజా 2009లో జగన్ మోహన్ రెడ్డి కొత్తగా స్థాపించిన YSRCPలో చేరారు. ఆ తరువాత ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున నగరి(Nagari Constituency) నుంచి చాలా స్వల్ప మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే కాగలిగారు. దీంతో 2019 లో కూడా నగరి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు జగన్. మళ్ళీ అక్కడ గెలిచి.. ఈసారి మంత్రి పదవిని కూడా పొందగలిగారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. 2024 ఎన్నికల సమయానికి ఆమెపై (Nagari Constituency)స్థానికంగా కొందరు నేతల్లో చాలావరకూ వ్యతిరేకత వ్యక్తం అయింది. మొదట్లో అక్కడ రోజాకు సీటు ఇవ్వడం కష్టమే అనే ప్రచారం బాగా జరిగింది. కానీ, చివరి నిమిషంలో రోజాకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా రోజాను తన చెల్లెమ్మ అంటూ ప్రచారం కూడా చేశారు. అయితే, ఈసారి ఎన్నికల సమయంలో ఆమెపై వైసీపీలో వ్యతిరేక వర్గం గట్టిగానే పనిచేసినట్టు స్థానికంగా చెప్పుకున్నారు. అదేమాట రోజా కూడా ఎన్నికలకు కొద్దిగా ముందుగా చెప్పుకుని వాపోయారు. “జగన్మోహన్ రెడ్డి వచ్చినపుడు ఎయిర్ పోర్ట్ లో ఆయన కాళ్ళకు దణ్ణం పెడతారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత నన్ను ఓడించడానికి ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు” అంటూ ఆమె పార్టీలో తన వ్యతిరేకులపై వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ఎన్నికలు ముగిసిపోయాయి. అక్కడ(Nagari Constituency) తాను తప్పకుండా గెలుస్తాను.. హ్యాట్రిక్ కొడతా అని చెప్పిన రోజా ఎన్నికల తరువాత పెద్దగా బయట కనిపించలేదు. స్థానికంగా మాత్రం ఆమె ఓటమి చెందబోతున్నారు అంటూ బాగా ప్రచారం అవుతోంది. ఆమె గెలుస్తారా? లేదా అనే విషయం జూన్ 4న తేలుతుంది. అయితే, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ పోటీచేశారు. టీడీపీలో ఉన్నపుడు రోజా ఎప్పుడూ ముద్దుకృష్ణమ నాయుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటూ చెప్పేవారు. ఇప్పుడు ఆయన కొడుకుతోనే తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. సైలెంట్ దేనికి సంకేతం.. రోజా విషయంలో ఎన్నికలకు చాలా ముందు నుంచే ప్రజల్లోనూ.. వైసీపీ నాయకుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ వార్తలు వచ్చాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తరువాత రోజా ఎప్పుడూ సైలెంట్ గా ఉండలేదు. 2014లోనూ, 2019లోనూ రోజా ఎన్నికల తరువాత తన విజయం ఖాయం అంటూ తన సహజశైలిలో విపరీతంగా ప్రకటనలు ఇస్తూ వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. ఓటమి తప్పదని సైలెంట్ అయ్యారని ఒక వర్గం అంటుంటే.. అదేమీలేదు ఎన్నికలకు, ఫలితాలకు మధ్య చాలా సమయం ఉండడంతో ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. అలానే, రోజాకూడా అంటూ కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఏదిఏమైనా రోజా మౌనం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది అనేది నిజం. ఇక్కడ(Nagari Constituency రోజా హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ లేదనే వాదనైతే ఎక్కువగా వినిపిస్తోంది. భాను ప్రకాష్ అత్యుత్సాహం.. రోజా పరిస్థితి అలా ఉంటే.. అక్కడ టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్ మరోరకంగా కలకలం రేపుతున్నారు. ఆయన అత్యుత్సాహమే.. వైసీపీ శ్రేణులను, రోజాను రెచ్చగొట్టాలనో కానీ, నగరి అంతటా ఆయన పేరుతో నగరి ఎమ్మెల్యే అంటూ ఫ్లేక్సీలు వెలిశాయి. దీంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఈ విధంగా ఫ్లేక్సీలు వేసుకోవడం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు. రోజా కూడా ఈ ఫ్లేక్సీలు ప్రత్యక్షం అయిన తరువాత కూడా పెద్దగా స్పందించలేదు. దీంతో రోజా విషయంలో అందరిలోనూ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ ఫ్లెక్సీ వ్యవహారంలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే(Nagari Constituency) ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని రిటర్నింగ్ ఆఫీసర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భాను ప్రకాష్‌పై ఈసీ కేసు నమోదు చేసింది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న నియోజకవర్గాల్లో నగరి కూడా ఒకటి. రాష్ట్ర ప్రజల దృష్టిలో రోజా పోటీ.. గెలుపు పై చాలా అంచనాలు ఉన్నాయి. వాటిలో నెగెటివ్.. పాజిటివ్ రెండూ ఉన్నాయి. కాకపోతే, ఇప్పుడు చర్చ అంతా రోజా సైలెన్స్ వెనుక ఉన్న అర్ధం ఏమిటి? అనే విషయంపైనే సాగుతోంది. #roja #nagari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి