Vasantha Krishna Prasad : వైసీపీ(YCP) ప్రభుత్వానికి ఏపీ(AP) లో మరో మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపీస్తున్న వేళ ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మారుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు అసంతృప్తులు వైసీపీనుంచి టీడీపీ(TDP) లోకి జంప్ కాగా.. తాజాగా మైలవరం(Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 8న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరగుతోంది.
వైఎస్ జగన్ షాక్..
ఇక గత పది రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనిపించని కృష్ణప్రసాద్.. నందిగామ మండలం ఐతవరంలోని తన ఇంట్లోనే కార్యకర్తలతో వరుస మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఆరో జాబితాలో మైలవరం నియోజకవర్గానికి ఇంఛార్జిగా స్వర్నాల తిరుపతి యాదవ్‌ను జగన్ నియమించారు. తిరుపతి యాదవ్ ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీ(ZPTC) గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేను కాదని, జెడ్పీటీసీగా ఉన్న తిరుపతి యాదవ్‌ను మైలవరం వైసీపీ ఇంఛార్జిగా నియమించడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సర్వేలతో పాటుగా సామాజిక వర్గ సమీకరణాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ గురించి సర్వేలలో సానుకూల స్పందన రాలేదని సమాచారం. అలాగే వసంతకృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. ఈసారి మైలవరం టికెట్ బీసీలకు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Amrapali: ఆమ్రపాలికి మరో కీలక బాధ్యత.. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్
యాదవ సామాజికవర్గం అయినందుకే..
ఈ నేపథ్యంలోనే యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి యాదవ్(Tirupati Yadav) ను ఇంఛార్జిగా నియమించినట్లు తెలిసింది. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. అయితే గతకొంతకాలంగా మైలవరం నుంచి ఈసారి వసంతకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం సాగుతూ వచ్చింది. సర్వేలలో వ్యతిరేకత వ్యక్తమవటంతో పాటుగా, బీసీలకు సీటివ్వాలనే కారణంతో వసంతకృష్ణ ప్రసాద్‌ను పక్కనబెట్టొచ్చనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో వసంతకృష్ణప్రసాద్ సైతం పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు. ఇటీవలి కాలంలో వసంతకృష్ణ ప్రసాద్ తన మాటల తీవ్రత కూడా పెంచారు. అయితే టికెట్ రాదనే క్లారిటీతోనే వైసీపీకి వసంతకృష్ణప్రసాద్ దూరం జరుగుతున్నారనే ప్రచారం సాగింది. దీనికి మరింత బలాన్నిస్తూ సిద్ధం సభ ఏర్పాట్లకు సైతం వసంతకృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ మారబోతున్నట్లు ప్రకటించడం విశేషం.