తెలంగాణ కాంగ్రెస్ కు (Telangana Congress) మరో బిగ్ షాక్ తగలనుంది. మునుగోడు నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి (Chalamala Krishnareddy), ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎడవల్లి సుభాష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని ఆ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది సేపట్లో వారు ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) బలమైన అభ్యర్థిని దించి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న మునుగోడు నేత చలమల కృష్ణారెడ్డికి టచ్ లోకి వెళ్లారు ఆ పార్టీ ముఖ్య నేతలు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చలమల కృష్ణారెడ్డికి బీజేపీ పెద్దల నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గ బాధ్యతలను చలమల కృష్ణారెడ్డి తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోయినా.. పార్టీ అభ్యర్థి స్రవంతి కోసం ఆయన పని చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఆయన ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..
అయితే.. ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో రెండో జాబితాలో మునుగోడు టికెట్ ను ఆయనకే కేటాయించింది హస్తం పార్టీ. దీంతో కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు జిల్లా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని వీడుతున్నారు కృష్ణారెడ్డి. ఆయన వెంట కాంగ్రెస్ కేడర్ కూడా బాగానే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది రాజగోపాల్ రెడ్డికి ఇబ్బందేనన్న చర్చ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతోంది.