Munneru Floods: మున్నేరు.. కృష్ణానదికి ఉపనది. ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వానలకు మున్నేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణం మొత్తం మున్నేరు వరదలో చిక్కుకుంది. అక్కడ పరిస్థితి దయానీయంగా మారింది. దీంతో ఖమ్మంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భారత నావికాదళ ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలకు హెలికాప్టర్లను పంపాలని కోరారు.
మున్నేరులో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతంగా ప్రవహించడంతో ఖమ్మం నగరంలోని మున్నేరు నదికి సమీపంలోని రాజీవ్ గృహకళాప, వెంకటేశ్వర్ నగర్, మోతీ నగర్, బొక్కలగడ్డ లతో పాటు 25 కాలనీల్లోని వారి ఇళ్లను 10 అడుగుల ఎత్తులో నీరు చేరుకుంది. దీంతో ఈ కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బాధిత వ్యక్తులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.వారి ఇళ్లు మునిగిపోవడంతో, కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి పైకప్పులపైకి ఎక్కారు. వారంతాసహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
మున్నేరు ఖమ్మం పట్టణాన్ని ఎందుకు ముంచేసింది..
Munneru Floods: పాలకుల పాపం.. అధికారుల ముందుజాగ్రత్త లేకపోవడం మున్నేరు వరదల్లో ఖమ్మం ప్రజలు చిక్కుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో మున్నేరు వాగు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. దీనికోసం 100 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారు. అయితే, అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పనులు పూర్తికాలేదు.
ఇప్పుడు మున్నేరుకు ఒక్కసారిగా వచ్చి చేరిన నీటితో బలహీనంగా ఉన్న కట్ట తెగిపోయింది. దీంతో వరద నీరు కాలనీలోకి ఉధృతంగా వచ్చి చేరింది. అదేవిధంగా పట్టణంలోని కాలనీల్లో సైడ్ డ్రైయిన్స్ వెడల్పు చేసే పని చేయలేదు.
దీంతో వర్షం నీరు మున్నేరులోకి వెళ్లే దరి లేకుండా పోయింది. దానికి తోడు మున్నేరు నీరు కూడా కాలనీలోకి వచ్చి చేరింది. మున్నేరు వాగు దాదాపుగా ఖమ్మం పట్టణానికి మధ్యలో ప్రవహిస్తుంది. దీంతో మున్నేరుకు అటూ ఇటూ ఉన్న ప్రాంతాలన్నీ వరదనీటిలో మునిగిపోయాయి.
ఆక్రమణలు కొంప ముంచాయి . .
ఖమ్మం పట్టణం వేగంగా విస్తరిస్తూ పోతోంది . ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన అంత వేగంగా జరగడం లేదు . అంతేకాకుండా . . ఈ విస్తరణ వేగంలో మున్నేరుకు ఇరువైపులా ఆక్రమణలు విపరీతంగా జరిగాయి . బఫర్ జోన్.. FTL ప్రాంతాల్లో పలు కట్టడాలు వెలిశాయి . ఈ అక్రమ కట్టడాలను నిరోధించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు . అదేవిధంగా నగరం విస్తరిస్తున్నా . . కాలువలను పెద్దవిగా చేయకపోవడం . . మున్నేరులోకి వచ్చి చేరే వర్షపు నీటిని అడ్డుకుంటూ చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడం ప్రస్తుత దుస్థితికి కారణం అని పలువురు ఆరోపిస్తున్నారు .
ప్రజలకు హెచ్చరికలు లేవు..
Munneru Floods: మున్నేరులో భారీ వరదనీరు వచ్చిచేరుతున్న సందర్భంగా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేయలేకపోయారు. భారీ వరద ముంచుకువస్తున్న సంకేతాలు చాలా ముందుగా కనిపించినా.. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయలేదు. దీంతో ప్రజలు వరద బీభత్సంలో చిక్కుకుపోయారు.