MP Vijayasai Reddy: విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నవారంతా టీడీపీ, చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వారేనని విచారణలో తేలిందన్నారు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. ఇటీవల విశాఖపట్నంలో సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ అనే ఓ సంస్థ కంటైనర్ లో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చినట్లు తెలిసిందని.. ఆ విషయాన్ని అనుకూలంగా మార్చుకుని టీడీపీ నేతలు వైసీపీపై, తనపై, తమ పార్టీ నాయకులపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎదుట వ్యక్తి మీద బురద జల్లి తాము తప్పించుకోవచ్చన్నదే చంద్రబాబు పాలసీ అని అన్నారు.
మొక్కుబడిగా మాత్రమే..
మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్న ఆ కంపెనీపైన సీబీఐ విచారణ జరుగుతోందని అన్నారు. డ్రగ్స్ దిగుమతి చేస్తున్న సమాచారం ఇంటర్ పోల్ వ్యవస్థకి అందడంతో వారు సీబీఐకి సమాచారం ఇచ్చారని అన్నారు. సీబీఐ రైడ్ చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయని, ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చంద్రబాబుకు సన్నిహితులని తేలిందని అన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న ప్రధాని మోదీ సైతం బాబును నమ్మరని అన్నారు. మొక్కుబడిగా మాత్రమే పొత్తు పెట్టుకున్నారని అన్నారు.
Also Read: కన్నీరు పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
దిగజారుడు రాజకీయాలు..
ఒక పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఏ దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారిని అభినందిస్తూ ట్వీట్ చేస్తానని, అందులో భాగంగా బ్రెజిల్ లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి ట్వీట్ చేశానని అన్నారు. చంద్రబాబు దాన్ని అనుకూలంగా చేసుకొని ఆ దేశంతో తనకు సంబంధాలు అంటగట్టి నిందారోపణలు చేయడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇంతలా దిగజారి రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని అన్నారు.
చంద్రబాబు సన్నిహితులే..
చంద్రబాబు అబద్దాల కోరని, అధికార దాహంతో ఎంతటి దారుణానికైనా దిగజారుతాడని అన్నారు. స్వార్దం కోసం మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు స్థాయి నుంచి ఆ పార్టీకి చెందిన చోటా నాయకుల వరకు బ్రెజిల్ సర్కార్ ప్రస్తావన తేవడం రాజకీయ దురుద్దేశమేనని అన్నారు. బ్రెజిల్ లో భారతదేశ దౌత్యాధికారి పేరు చివర రెడ్డి ఉండడంతో ఆ వ్యవహారాన్ని వైసీపీకి అంటగడుతున్నారని అన్నారు. అయితే దౌత్యాధికారిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని గుర్తించాలని కోరారు. చివరకు అసలు నిజం బయటపడిందిని, డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు సామాజిక వర్గం నేతలు, ఆయన సన్నిహితులే ఉన్నారని విచారణలో తేలిందని అన్నారు.