MP Ranjith Reddy: చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రసంగించారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయిన తర్వాత... పేదోల్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని… గాంధీ, నెహ్రూ కుటుంబమే అని చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమం కాంగ్రెస్తోనే దేశానికి దశా-దిశ దొరికిందని అన్నారు. తమ చేవెళ్ళ వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే, తమ పార్లమెంట్ ప్రాంతం... హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్ వేర్ దాకా ఎగుమతి చేస్తందని చెప్పారు.
హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు మనయేనని… దేవునింట్ల పూవ్వులు మనవేనని... కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు. తాను ఎంత అదృష్టవంతున్ని అయితే ఈ ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీని అవుతానని గుర్తు చేశారు. అయితే, ఈ అదృష్టం చేవెళ్ళ ప్రజలు ఇచ్చిన అవకాశమని… అదే అదృష్టం ప్రతి చేవెళ్ళ బిడ్డ కళ్ళల్ల చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు.
ఒక టీచర్ 60 ఏండ్లకు రిటైర్ అయితడని… ఒక మిలిట్రీ సిపాయి 40 ఏండ్లకు రిటైర్ అయితడని... కానీ తనకు మాత్రం రిటైర్మెంట్ తన చేవెళ్ళలో ప్రతి ఒక్కరి కల్లలో ఆనందం చూసేవరకు అంటూ భావోద్వేగానికి గురవుతూ రంజిత్ రెడ్డి మాట్లాడారు. ఇక చేవెళ్ళ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకులు అంటించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు తెలిపారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని… ఈ సారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అవి… అభివృద్ధి, అందుబాటు, విద్యా, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన జెండా… ఎజెండా అని స్పష్టం చేశారు.