Telangana Nominations: ఈ నెల 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో నామినేషన్లు వేసేందుకు మరో కొన్ని గంటల సమయం ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ నామినేషన్లు వేసేందుకు ఆర్వో ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. తాజాగా దుబ్బాకలో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) నామినేషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 30వ తేదీన ప్రచారంలో భాగంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ప్రచారం చేస్తుండగా గుర్తి తెలియని వ్యక్తి ప్రభాకర్‌ను కత్తితో కడుపులో పొడిచిన సంగతి తెలిసింది. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ అంబులెన్స్‌లో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి!
ఇవాళ ఉదయం నుంచి పలువురు నేతలు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. ఇవాళ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేశారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ వేయగా.. మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి నామినేషన్ వేశారు. ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ నామినేషన్ వేశారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాల్క సుమన్... కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి నామినేషన్ వేశారు. మరోవైపు వినూత్నంగా మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని ఆర్వో ఆఫీసుకు ఎడ్ల బండిపైన వెళ్లి నామినేషన్ వేశారు.
సూర్యాపేట నుంచి బరిలోకి దిగే తమ అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనకే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందనే ధీమాతో ఇవాళ సూర్యాపేట ఆర్వో ఆఫీసుకు తన అంచరులతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మరి కాంగ్రెస్ అధిష్టానం దామోదర్ రెడ్డికి కేటాయిస్తుందా? లేదా? అనేది చూడాలి.