Zaheerabad BJP MP: జహీరాబాద్ బీజేపీ (BJP) ఎంపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ హిందూత్వ అజెండా నచ్చే పార్టీలో చేరానని చికోటి చెబుతున్నారు. తనకు జహీరాబాద్ టికెట్ ఇస్తే గెలిచి వస్తానని పార్టీ నేతల వద్ద ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే టికెట్ కోసం ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆలే భాస్కర్ ఉన్నారు. వీరిద్దరితో పాటు మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!
జైపాల్ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. భాగారెడ్డి చరిష్మా, స్థానికత తనకు కలిసొస్తుందని ఆయన చెబుతున్నారు. మరో బీజేపీ నేత ఏలేటి సురేష్ రెడ్డి జహీరాబాద్ టికెట్ తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇంకా.. రచనా రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు కూడా జహీరాబాద్ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మేడపాటి ప్రకాష్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోధన టికెట్ ఆశించి భంగపడ్డారు.
గత ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించిన లక్ష్మారెడ్డి..
ఇంకా లక్ష్మారెడ్డి విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో జహీరాబాద్ (Zaheerabad) నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 13 శాతం ఓట్లు సాధించారు. గతంలో ఓడిపోయిన సానుభూతి తనకు కలిసి వస్తుందని ఆయన చెబుతున్నారు. భారీగా అభ్యర్థులు పోటీ పడుతుండడంతో జహీరాబాద్ టికెట్ ను బీజేపీ ఎవరికి కేటాయిస్తుందనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
పార్లమెంట్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్:
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) సైతం రాష్ట్రానికి వచ్చి నేతలకు దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కకు పెట్టి పని చేయాలని సూచించారు. సిట్టింగ్ లంతా అదే స్థానాల నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: BJP-Janasena: జనసేన మా మిత్ర పక్షమే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు