Bandi Sanjay: 317 జీవోను సవరిస్తారా? లేదా?

317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్. చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గంగాధర మండలంలోని పంటలకు సాగునీటిని విడుదల చేయమని కోరారు.

New Update
Bandi Sanjay: 317 జీవోను సవరిస్తారా? లేదా?

Bandi sanjay On GO 317: ఉద్యోగ, ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారిన 317 జీవోను సవరిస్తారా? లేదా? అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 317 జీవోను సవరించాలని బీజేపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని, తాను జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం 317 జీవోను సవరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

అధికారులు పట్టించుకోవడం లేదు:
ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని చర్లపల్లికి విచ్చేసిన బండి సంజయ్ రూ. 23 లక్షల కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలతో కలిసి బీరప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు బండి సంజయ్ కు గొంగడి బహుకరించారు. ఆ తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 'చొప్పదండి నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగు నీరు రాక రైతులు పంటలు ఎండిపోతున్నాయనే బాధలో ఉన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలని గత కొద్దిరోజులుగా రైతులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు.. తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను కోరుతున్నా. రేపు మాపు అని సాకు చూపకుండా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. రాజకీయ పార్టీలు ఆందోళన చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా..' అని చెప్పారు.

మూర్ఖత్వపు ఆలోచన:
కేసీఆర్ ప్రభుత్వ మూర్ఖత్వపు ఆలోచనవల్ల 317 జీవో పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని చేశాయన్నారు బండి సంజయ్. ఉద్యోగులంతా రోడ్డెక్కారని.. చాలా మంది ఆత్మహత్యలు, హఠాన్మరణాలపాలయ్యారన్నారు. అయినా 317 జీవోను సవరించలేదని.. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసిందని తెలిపారు. 'నేను నా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే పోలీసులు గ్యాస్ కట్టర్లతో నా కార్యాలయ గేట్లను ధ్వంసం చేసి నన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు..' అని చెప్పుకొచ్చారు.

మీ కంటికి కనిపించడం లేదా?
317 జీవోను సవరించాలని కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల్లో కోరారని గుర్తు చేశారు బండి సంజయ్. అధికారంలోకి వచ్చిన తర్వాత సవరిస్తామని చెప్పారన్నారు. మరి ఇప్పుడెందుకు జాప్యం చేస్తున్నారని తెలిపారు. డబ్బులతో పనిలేదని.. జీవోను సవరిస్తే చాలని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా మీ కంటికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు? ఆ సంఘం నాయకులంతా ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారని.. దయచేసి వారికి అపాయిట్ మెంట్ ఇవ్వాలన్నారు. వారి సమస్యను విని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానని చెప్పారు.

కలెక్టర్, ఎస్ఈతో మాట్లాడిన బండి సంజయ్

నారాయణపూర్ రిజర్వాయర్ నీటి విడుదలపై నిన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో మాట్లాడిన బండి సంజయ్ ఈరోజు జిల్లా ఇరిగేషన్ అధికారి గుప్తతో చర్లపల్లి గ్రామం నుండి ఫోన్ లో మాట్లాడారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సానుకూలంగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Also Read: తెలంగాణలో మళ్లీ వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ?
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు