/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Protien-Supliments-jpg.webp)
Protein Supplements: ఇటీవల పతంజలి ప్రోడక్ట్స్ పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ గురించి మీరు వినే ఉంటారు. పతంజలి ప్రోడక్ట్స్ విషయంలో పతంజలి చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఆ ప్రాడక్ట్స్ పై తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కోర్టు పతంజలి పై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, ఇలా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ విషయంలో పతంజలి మాత్రమే కాదు చాలా కంపెనీలు మనల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వాటిలో మన కండరాల బలాన్ని పెంచడానికి అవసరమైన ప్రోటీన్స్ అందిస్తాయి అని చెబుతూ వచ్చే ప్రోడక్ట్స్ విషయంలో వస్తున్న ప్రకటనల్లో చాలావరకూ మనల్ని తప్పుదోవ పట్టించేవే ఉంటున్నాయి. ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. విచిత్రం ఏమిటంటే.. శరీరంలోని కణజాలాల పెరుగుదల.. వాటి సమస్యల నివారణ.. వాటి నిర్వహణ కోసం అవసరమైన ప్రోటీన్స్ పేరుతో జరుగుతున్న వ్యాపార పరిమాణం. మార్కెట్ పరిశోధన సంస్థ IMARC గ్రూప్ ప్రకారం 2023లో భారతీయ ప్రోటీన్ ఆధారిత ప్రోడక్ట్స్ మార్కెట్ పరిమాణం ₹ 33,028.5 కోట్లకు చేరుకుంది.
ఇంత భారీ మార్కెట్ పై ఇటీవల ఒక పరిశోధన జరిగింది. అందులో మనదేశంలో అమ్ముతున్న.. వినియోగిస్తున్న ప్రోటీన్ పౌడర్ల(Protein Powders) పై ప్రధానంగా అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో ఈ సప్లిమెంట్‌లలో ఎక్కువ భాగం తప్పుడు సమాచారాన్ని అందించడం, నాణ్యతపై తప్పుడు- ప్రకటనల క్లెయిమ్‌లను అందించడం గమనించారు.
విటమిన్లు, ఖనిజాలు, ఇతర సహజ పదార్ధాలు వంటి మూలికా, ఆహార పదార్ధాలతో సహా 36 ప్రసిద్ధ బ్రాండ్‌ల ప్రోటీన్ పౌడర్‌లపై చేసిన పరిశోధన ఫలితాలను మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
కండర ద్రవ్యరాశిని పెంచడానికి, వ్యాయామం రికవరీని మెరుగుపరచడానికి, వాటి పనితీరును మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లు, వినోద పరిశ్రమలో ఉన్న పెద్దలు, సైనికులు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్ధాలలో ప్రోటీన్ పౌడర్(Protein Supplements)లు ఒకటి. ఇవి ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల మూలాలుగా బాడీబిల్డింగ్ కోసం ఉపయోగించబడతాయి.
ఈ అధ్యయనం ఫలితాలు ఇలా ఉన్నాయి..
36 సప్లిమెంట్లలో 70 శాతానికి పైగా సరికాని ప్రోటీన్ సమాచారాన్ని కలిగి ఉన్నట్లు అధ్యయనం చూపించింది, కొన్ని బ్రాండ్లు వారు క్లెయిమ్ చేసిన వాటిలో సగం మాత్రమే అందిస్తున్నాయి.
అలాగే, 14 శాతం శాంపిల్స్‌లో హానికరమైన ఫంగల్ అఫ్లాటాక్సిన్‌లు ఉన్నాయి. అంతేకాకుండా 8 శాతం వాటిలో పురుగుమందుల అవశేషాల జాడలు కూడా కనిపించాయి.
Also Read:ఈ 555 రూల్ పాటిస్తే.. రిటైర్మెంట్ లైఫ్ కోట్లతో ఎంజాయ్ చేయొచ్చు!
కేరళలోని రాజగిరి ఆసుపత్రికి సంబంధించిన క్లినికల్ పరిశోధకులు అలాగే, యుఎస్ నుండి ఒక సాంకేతిక వ్యాపారవేత్త ఈ అధ్యయనంలో పాలు పంచుకున్నారు. వీరు భారతదేశంలో తయారు చేసిన మూలికా ప్రోటీన్ ఆధారిత సప్లిమెంట్లు నాణ్యతలో తక్కువగా ఉన్నాయని చెప్పారు.
"ప్రోటీన్ ఆధారిత మూలికా, ఆహార సప్లిమెంట్ పరిశ్రమకు మార్కెట్ చేయడానికి ముందు కఠినమైన పరిశీలన, నియంత్రణ, ప్రాథమిక భద్రతా అధ్యయనాలు అవసరమని మేము నిరూపించాము" అని ఆ పరిశోధకులు చెప్పారు.
ప్రోటీన్ పౌడర్ల(Protein Supplements) వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిపుణులు వాటి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మాంసకృత్తులు తీసుకోవడం వల్ల ప్రజలు నిండుగా అనుభూతి చెందడానికి సహాయపడవచ్చు. కానీ వీటిలోని భద్రతా సమస్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధిక మొత్తంలో ప్రోటీన్లను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సలహా ఇస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, అలర్జీ, మలబద్ధకం, పోషకాహార లోపం వంటి సమస్యలను కలిగిస్తుందని, అలాగే మీ కిడ్నీలు, కాలేయాలను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకటనలు చూసి ప్రోటీన్ పౌడర్లను వాడటం ప్రమాదకరమని ఈ నివేదిక ద్వారా.. నిపుణులు చెబుతున్న విషయాల ద్వారా అర్ధం అవుతోంది.