Mood of the Modi: ఏపీలో బీజేపీ మూడు ముక్కలాట 

ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎవరి అంచనాలకు అందడం లేదు. అమిత్ షా-చంద్రబాబు భేటీ, ప్రధాని మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంతనాలు, జనసేనాని ఢిల్లీ ప్రయాణం దీంతో పెద్ద పజిల్ లా ఏపీ పాలిటిక్స్ మారిపోయాయి. 

New Update
Mood of the Modi: ఏపీలో బీజేపీ మూడు ముక్కలాట 

Mood of the Modi: ఏమి జారుతుందో తెలిస్తే అది రాజకీయం కాదు. అసలేమవుతుందో అర్ధం కాకపొతే మాత్రం కచ్చితంగా ఏపీ రాజకీయాలే. ఎందుకంటే.. ఎవరు ఎవరితో ఉన్నారు? ఎవరు ఎవరితో కలుస్తారు? ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో దూకుతాడు? ఏ పార్టీలో ఉన్నరో కూడా తెలియని ఎంపీలు ఎందరు ఉన్నారు? ఇలాంటి అన్ని ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లోనే వస్తాయి. ఏపీ అంత గందరగోళ రాజకీయం దేశంలో మరెక్కడా ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. బీజేపీ వైసీపీ రహస్య మిత్రుల్లా ఉంటాయి. ఒకరి మీద ఒకరు చచ్చినా ఒక్క మాట అనుకోరు. అనుకున్నా కూడా జల్లెడ అడ్డు పెట్టి ఊకతో కొట్టుకున్నట్టే ఉంటుంది. ఇక వైసీపీని దించాల్సిందే అని మైకులు బద్దలయ్యేలా ప్రచారం చేసే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నామని చెబుతాయి. మరోవైపు అదే జనసేన - టీడీపీతో సీట్ల పంపకాలు మొదలు పెట్టేస్తుంది. బీజేపీ మాత్రం జనసేన మా మిత్రపక్షమే.. టీడీపీ గురించి మాట్లాడవద్దు.. అంటుంది. ఇవన్నీ చూస్తే ఎవరో చెప్పినట్టు.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని ఎక్కడికో పోవాలని అనిపించడం గ్యారెంటీ. 

ఎప్పుడూ వేడిగా ఉండే రాజకీయాలు కేవలం ఏపీలోనే ఉంటాయి. అవి చల్లారడం జరిగేపని కాదు. కాకపోతే అప్పుడప్పుడు మరింత వేడిగా మారిపోతాయి. ఈ వేడిలో ఎవరు మాడిపోతారనేది ఎవరూ చెప్పలేరు. ఎన్నికలు దగ్గరకు వస్తుంటే.. ఏపీ రాజకీయాలు మామూలుగా వేడెక్కడం లేదు. తాజాగా ఈ వేడి మరింత ఎక్కువై రాజకీయ పరిశీలకులకే కాకుండా సామాన్య జనానికి కూడా తలలో ఆవిర్లు వచ్చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్జెంట్ గా ఢిల్లీ వెళ్లి.. బీజేపీ పెద్దలు అమిత్ షా.. జేపీ నడ్డాలతో పొత్తు చర్చలు జరిపి వచ్చారు. ఆయన విమానం ఇంకా గాలిలో ఉండగానే.. ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హస్తినలో వాలిపోయారు. పార్లమెంట్ దగ్గరకు వెళ్లి మరీ ప్రధాని మోడీని(Mood of the Modi)కలిసి మాట్లాడేశారు. ఇద్దరూ దాదాపు గంటన్నర పాటు మాట్లాడేసుకున్నారని అక్కడి మీడియా రిపోర్ట్స్. ఇక జనసేనాని ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది అని ఎవరినైనా అడిగితె.. ఒక వెర్రి చూపు చూస్తారు అంతే. 

బీజేపీతో పొత్తు చర్చల కోసం అమిత్ షా పిలిస్తేనే నేను వెళ్ళాను అంటారు చంద్రబాబు నాయుడు. ప్రధానితో రాష్ట్రానికి రావలసిన నిధుల కోసమే (Mood of the Modi )కలిసాను అంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లెక్కలు తీర్చడం కోసమే ఢిల్లీ వెళుతున్నాను అంటారు పవన్ కళ్యాణ్. ముగ్గురిలో ఏది కరెక్ట్? అసలు ప్రధాని మోడీ మనసులో ఏముంది? ఇది తెలిస్తే ఈ కథనం అవసరమే లేదు. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైసీపీ-బీజేపీ పొత్తు లేదా ఎప్పటిలానే రహస్య ఒప్పందం కుదుర్చుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని వినిపిస్తోంది. అదే నిజమైతే.. నేరుగా పొత్తు ఎలానూ సాధ్యం కాదు కానీ.. రహస్య ఒప్పందం ఏదైనా వైసీపీ బీజేపీ మధ్య కుదిరితే.. టీడీపీ పరిస్థితి ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. కానీ, టీడీపీ కంటే దీనివలన జనసేనకె ఎక్కువ నష్టం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్నీ కాదు కానీ.. ఇదంతా ప్రధాని మోడీ రాజకీయం అని చాలామంది భావిస్తున్నారు. 

బీజేపీ 400 సీట్లు గెలవడమే టార్గెట్ అని పెట్టుకుంది. అయితే, దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు కావలసి ఉంటుంది. ఏపీలో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. వైసీపీ ఒకవైపు.. టీడీపీ-జనసేన ఒకవైపు.. మోహరించాయి. బీజేపీకి ఏపీలో అసలు సీన్ లేదు. పార్టీ ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒంటరిగా కానీ, కూటమిగా కానీ సీట్లు తెచ్చుకోవాలనేది బీజేపీ లెక్క. దీని కోసం మోడీ (Mood of the Modi)ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఫార్ములా బయటకి తీశారని అనుకుంటున్నారు. బీజేపీ వెస్ట్ బెంగాల్ లో క్రీస్టియన్ - నాన్ క్రీస్టియన్ గా ఓటర్లను విడదీసే ప్రయత్నం చేసింది. అది విజయవంతం అయిందని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. దాదాపుగా 19 ఎంపీ స్థానాలు బీజేపీకి అక్కడ వస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడ సక్సెస్ అవుతోంది అని భావిస్తున్న  ఫార్ములానే ఏపీలో కూడా తీసుకురావాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే వైఎస్ జగన్ క్రీస్టియన్ అనే అంశాన్ని ప్రజల్లోకి ప్రతిపక్షాలు బలంగా తీసుకు వెళ్లాయి. అంతేకాకుండా, ఇటీవలే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన జగన్ సోదరి షర్మిల కూడా ఈ విషయంపై నేరుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రతిపక్షాలను నాన్ క్రీస్టియన్ వర్గంగా.. వైసీపీని క్రీస్టియన్ వర్గంగా చూపిస్తూ.. హిందూయిజాన్ని తెరపైకి తెచ్చే ఆలోచన ప్రధాని మోడీ(Mood of the Modi)చేస్తున్నారని అనుకుంటున్నారు. బీజేపీ ఏపీ వ్యవహారాల్లో ఇదొక కోణం. 

ఇక ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు.. ముఖ్యంగా ఇండియాటుడే సర్వేలో స్పష్టంగా టీడీపీ-జనసేన కూటమి ఆధిక్యం కనిపించింది. అందుకే.. ఆ రెండు పార్టీలతోనూ కలిసి వెళ్లి.. ఎక్కువ ఎంపీ స్థానాలు ఏపీలో తమ పాకెట్లో వేసుకుంటే బెటర్ అనే ఆలోచన ఒకటి బీజేపీ చేస్తోంది. అందుకు అనుగుణంగానే సీట్ల బేరసారాలకు చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ జరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఇది ఒక లెక్క. 

Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!

ప్రధాని మోడీ (Mood of the Modi)జగన్ తో ఇంతకు ముందులానే రహస్యంగా అవగాహన కుదుర్చుకుని.. టీడీపీ-జనసేన కూటమితో కలవకుండా విడిగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పుడు ఎలానూ జగన్ తన అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇదే అవకాశంగా కొన్ని ప్రత్యేకంగా స్థానాలను బీజేపీకి వదిలివేసి.. అక్కడ నామ మాత్రపు పోటీ వైసీపీ ఏర్పాటు చేస్తే.. ఆ విధంగా ఎక్కువ సీట్లు గెలవచ్చు. పైగా భవిష్యత్ లో కూడా ఎవరిమీదా ఆధారపడి పని ఉండదు అని బీజేపీ భావిస్తోంది. అయితే, అసలు ఓటు బ్యాంక్ లేని చోట ఎలా గెలుస్తారు అనే విషయంలోనూ తర్జన భర్జన జరిగిందనీ.. ముక్కోణపు పోటీ జరిగితే అక్కడ బీజేపీకే లాభం ఉంటుందనీ.. ఎంపీ ఎన్నికల్లో ఏపీలోనూ బీజేపీకి ప్రజలు పట్టం కడతారని అంచనా వేస్తున్నారట. 

మొత్తమ్మీద ఏపీ రాజకీయాల విషయంలో ఏదీ ఒక పట్టాన అర్ధం కాదు. ఎన్నికలు సమీపిస్తున్నా ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది అర్ధంకాని పజిల్ లా మారిపోయింది. ఏదిఏమైనా బీజేపీ మాత్రం ఇటు వైసీపీతోనూ.. అటు టీడీపీతోనూ.. మరోవైపు జనసేనతోనూ మూడు ముక్కలాట ఆడుతోంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆటలో చివరికి ఏది ఎటు చేరుతుందో.. ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారో వేచి వేచి చూడాల్సిందే. ఎందుకంటే, అంచనాలు వేయడానికి అవి దేశ రాజకీయాలు ఏ మాత్రం కావు. అంతుచిక్కని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు