ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీ తీరం వెంబడి పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి భయంకరంగా ఉంది. తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తోంది. గుంటూరు, ప్రకాశం, కృష్టా, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి , శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం తీర ప్రాంతాల్లో ఇప్పటికే 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అందుకే అధికారులు ఇప్పటికే ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణశాఖాధికారులు వివరించారు. తుఫాన్ తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో దివిసీమ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తీరం వెంబడి మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిచౌంగ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫాన్ దాటికి ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ సత్య కుమార్ పై చెట్టు విరిగి పడడంతో దుర్మరణం చెందాడు.
ఓ వైపు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండడంతో అదే సమయంలో బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: మిచౌంగ్ ఎఫెక్ట్..హైదరాబాద్ లో మొదలైన వాన!