Senior Actor Mohanlal : మలయాళ ఇండస్ట్రీని హేమా కమిటీ రిపోర్ట్ కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులపై ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌పై (AMMA) తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు.
సుమారు 17 మంది సభ్యులు AMMA నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఇప్పటికే హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా మోహన్ లాల్ కంటే ముందు దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు.
మరోవైపు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హేమా కమిటీ నివేదికపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అన్నారు.