Modi Wayanad Tour : కేరళ (Kerala) లోని వయనాడ్ లో జులై 30 వ న సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా సహాయ, పునరావాస చర్యలను మోదీ సమీక్షించనున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు కన్నూర్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి వయనాడ్‌లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు వివరించారు. అలాగే, మధ్యాహ్నం 12:15 గంటలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోదీ పరిశీలిస్తారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రెస్క్యూ ఫోర్స్ సహాయక చర్యలు గురించి అధికారులు వివరించనున్నారు.
ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పునరావాస పనులను దగ్గరుండి మరీ ప్రధాని పర్యవేక్షిస్తారు. అలాగే, బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలు, ఆసుపత్రిని కూడా సందర్శించనున్నారు. అక్కడ కొండచరియలు విరిగిపడిన బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని ఈ సందర్భంగా మోదీ పరామర్శిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకోనున్నారు.
Also read: రచ్చకెక్కిన దువ్వాడ బాగోతం… అర్థరాత్రి ఉద్రిక్తత!