విపక్ష కూటమి 'ఇండియా'కు చెందిన నేతలు పార్లమెంటులో తాము అనుసరించాల్సిన వ్యూహంపై మరికొద్దిసేపట్లో చర్చించనున్నారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్‌లో జరగనున్న సమావేశంలో మణిపూర్ అంశమే ప్రధాన అజెండా కానుంది. ఆ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించి తిరిగి వచ్చిన 21 మంది సభ్యుల ప్రతినిధి బృందం.. తమ ఫ్లోర్ లీడర్లకు అక్కడి పరిస్థితులపై వివరించబోతున్నారు. తమ తొలిరోజు పర్యటనలో వీరు మణిపూర్ లోని షెల్టర్ హోమ్స్ లో తలదాచుకున్న నిర్వాసితులను కలుసుకున్నారు. ఇంఫాల్, మొయిరాంగ్, బిష్ణుపూర్, చురా చంద్ పూర్ జిల్లాల్లోని పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా ఉందని ఈ ఎంపీలు పేర్కొన్నారు. తమ పర్యటన అనుభవాలకు సంబంధించి వీరు నిన్నరాజ్ భవన్ లో ఆరాష్ట్ర గవర్నర్ అనసూయ ఊకేని కలిసి ఓ మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చూసేందుకు వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి పరిస్థితులను వివరించాలని ఈ మెమొరాండంలో కోరారు. మణిపూర్ లో గత 89 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, అల్లర్లు, ఘర్షణలకు గురై పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారికి సరైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించలేదని విపక్ష ఎంపీలు వెల్లడించారు. ఇవే అంశాలను వీరు ఫ్లోర్ లీడర్లకు వివరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతినిధి బృందం లోని సభ్యుల్లో పలువురు ముక్త కంఠంతో ఇవే అభిప్రాయాలను స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని అంశాలనూ పక్కనబెట్టి మణిపూర్ అంశంపైనే ప్రధానంగా చర్చించాలని ప్రతిపక్ష కూటమి సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ నెల 20 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనపప్పటి నుంచే వీరి రభసతో ఉభయ సభలూ వాయిదా పడుతూ వచ్చాయి. మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సాధ్యమైనంత త్వరగా దీనిపై చర్చకు తేదీని, సమయాన్ని నిర్ణయించాలని ఈ ఎంపీలు కోరుతున్నారు.
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రతిపాదన ?
వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సోమవారం హోమ్ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన అంశాలపై కేంద్రానికే అధికారాలను కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్ స్థానే బిల్లును తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. తన ప్రభుత్వ అధికారాలను హరించేలా ఉన్న దీన్ని పార్లమెంటులో వ్యతిరేకించాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఇదివరకే పలువురు విపక్ష నేతలను కలుసు కుని వారి మద్దతును కోరారు. ఏది ఏమైనా ఈ అంశంపై పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పటికే ముసాయిదా బిల్లుకు సంబంధించిన ప్రతులను ఎంపీలకు సర్క్యులేట్ చేసింది.గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) యాక్ట్-2023 పేరిట గల ఈ బిల్లు వ్యవహారాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తన సిఫారసులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించవలసి ఉంటుంది.
పార్లమెంటులో మళ్ళీ రభస తప్పదా ?
ఢిల్లీ ఆర్డినెన్స్ పై పార్లమెంటులో విపక్షాలు మళ్ళీ ప్రభుత్వాన్ని ఇరకాటాన బెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చి కేంద్రం ఈ ఆర్డినెన్స్ ను ఎలా తెస్తుందని ఇవి ప్రశ్నిస్తున్నాయి. మణిపూర్ అంశంతో బాటు దీనిపైనా విపక్ష ఎంపీలు పార్లమెంటులో తీవ్రంగా పోరాడే సూచనలున్నాయని అంటున్నారు. జులై 25 న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించారు. ఇప్పుడిది లోక్ సభ ముందుకు రానుంది. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా దీన్ని ఉభయసభల్లో ఆమోదింపజేసుకోవడానికి బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే యత్నిస్తోంది.