MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాగా ఈరోజు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కవిత కలవనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్నారు.
కాగా మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 5 నెలల పాటు ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. కాగా ఇటీవల మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు.
నేను తప్పు చేయలేదు: కవిత
తాను ఏ తప్పు చేయలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కేసు అపవాదులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తాననే విశ్వాసం తనకుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని చెప్పారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ధర్మమే గెలిచి తీరుతుందని అన్నారు. తనకు మద్ధతుగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.