TS MLC Elections: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుందని రిటర్నింగ్ అధికారి , కలెక్టర్ రవినాయక్ తెలిపారు. శనివారం ఆయన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వివరించారు.
కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 వరకు కౌంటింగ్ కేంద్రంలో రిపోర్ట్ చేస్తారన్నారు. ఉదయం 7:30 గంటలకు స్ట్రాంగ్ రూమ్ తెరచి, బ్యాలెట్ బాక్స్‌లు బయటకు తెస్తారన్నారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద సిబ్బంది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, అందుకే కౌంటింగ్‌లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు మొదలు పెడతారని చెప్పారు.
కౌంటింగ్ కోసం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదట 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను, వచ్చిన బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారని, ఆ తర్వాత మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావలసిన కోటాను నిర్ధారిస్తారని పేర్కొన్నారు. అనంతరం మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారన్నారు. ఆ ప్రకారం ప్రతీ అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కించి, ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడ ఓట్లను సాధిస్తే అతను గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటిస్తారని పేర్కొన్నారు.
ఏ అభ్యర్థికీ కోటా రాకుంటే చివరికి మిగిలిన అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు. ఈ ప్రక్రియ అంతా కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో జరుగుతుందన్నారు.
Also read: ఏపీలో దారుణం..డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్ కానిస్టేబుల్!