Kamareddy: రోడ్డు కోసం సొంత ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులపై దృష్టి పెట్టిన ఆయన.. రోడ్డుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని అధికారులచేత దగ్గరుండి కూలగొట్టించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

New Update
Kamareddy: రోడ్డు కోసం సొంత ఇంటిని కూల్చేసిన ఎమ్మెల్యే

MLA Katipally Venkata Ramana Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ ను ఓడించి సంచలనం సృష్టించిన కామెరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) కాటిపల్లి వెంకటరమణారెడ్డి  మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరు సీఎం క్యాండెట్లపై ఆరు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన.. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వార్తల్లో నిలుస్తున్నారు. వినూత్న నిర్ణయాలతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన తాజాగా ఓ సంచలన నిర్ణయంతో ఔరా అనిపించారు.

రోడ్డు కోసం.. 
ఈ మేరకు ప్రస్తుతం కామారెడ్డి (Kamareddy) లో రోడ్ల విస్తరణ పనులపై ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణకు స్వయంగా ఎమ్మెల్యే ఇళ్లే అడ్డుగా ఉందని అధికారులు సూచించారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా సొంత ఇంటిని దగ్గరుండి మరీ అధికారుల చేత కూల్చివేయించారు. ఇంటిని కూల్చివేసే పనులు ఆయనే స్వయంగా ప్రారంభించారు. జేసీబీ సహాయంతో ఇంటిని అధికారులు కూల్చగా ఈ పనులను స్వయంగా ఆయన పరిశీలించారు.

అభివృద్ధికి సహకరించాలి..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవలో నష్టం జరిగినా ముందు తానే భరిస్తానని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ప్రజలను కోరారు. ఇక పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్‌ అధికారులు అప్పగించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisment
తాజా కథనాలు