MLA Lasya: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పఠాన్ చెరు పోలీసులు. 304ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పీఏ ఆకాష్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు పేర్కొంది అని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు. అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి త్వరలోనే ప్రమాదానికి గల కారణాలను వెలికి తీస్తామని ఆయన తెలిపారు.
మూడు సార్లు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమెతో పాటు కారులో ఉన్న డైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరి లో లాస్య నందిత తండ్రి , ఎమ్మెల్యే సాయన్నమృతి చెందారు. సరిగా ఏడాది తరువాత లాస్య కూడా మృతి చెందడంతో పార్టీ వర్గాలు దుఃఖంలో మునిగిపోయాయి.కొద్ది రోజుల క్రితం లాస్య ఒక లిప్టులో మూడు గంటలు ఇరుక్కొని ఇబ్బంది పడగా, ఇటీవలనల్గొండ సభకు వెళ్లినప్పుడూ కూడా ఆమె కారు కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అప్పుడు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ మూడవసారి ఆమెను మృత్యువు కబలించింది.
పడే మోసిన హరీష్ రావు..
లాస్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె పార్థివదేహాన్ని ఆమె ఇంటికి తరలించారు. లాస్యనందిత భౌతికకాయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. లాస్యనందిత కుటుంబసభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాస్య నందిత భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా..హైదరాబాద్ కార్ఖానాలోని ఆమె ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి లాస్యనందిత పాడెను మోశారు.మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.