MK Stalin: ప్రస్తుత సమాజంలో అవయవదానం గొప్పదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిన వారు, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేస్తే వారు పునర్జన్మ పొందుతారు. అందుకే అవయవాల దానం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ తరుణంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానాలు చేసే వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రకటించారు.
అవయవదానం చేయడంతో తమిళనాడు దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. నిస్వార్ధంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతల వల్లే తమిళనాడుకు ఈ ఘనత దక్కిందన్నారు. తమ ఆత్మీయులు చనిపోయిన విషాదకర పరిస్థితుల్లోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. అవయవదానం చేసిన వారి త్యాగాన్ని గౌరవించాలనే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. స్టాలిన్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని పాటించాలని సూచిస్తున్నారు.
ఉత్తమ అవయవ, కణజాల మార్పిడి సంస్థగా అవార్డును తమిళనాడు రాష్ట్రం సొంతం చేసుకంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చేతుల మీదుగా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ అవార్డును అందుకున్నారు. అయితే 2022 సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక అవయవదానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం 2022లో తెలంగాణలో 194 అవయవదానాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో 154 అవయవ దానాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర వరుస స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాన్ని అధిగమించి తొలి స్థానం చేరుకుంది.
కాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో అవయవదానం చేసే వారి అంత్యక్రియల విషయలో స్టాలిన్ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తొలిసారి భేటి అయిన కోవింద్ కమిటీ