ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికీ, గ్రామ గ్రామానికి నాణ్యమైన ఆరోగ్యం అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Arogya Suraksha) పథకం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని (Health Minister vidudala Rajini) అన్నారు. ఐదు దశలలో ఈ పథకం ఉంటుందని మంత్రి తెలియజేశారు. గత నెల30న ప్రారంభించిన ఈ పథకంలో 10,574 క్యాంపులను రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు, ఇప్పటికే 1,235 క్యాంపులు నిర్వహించినట్లు 3 లక్షల 35 వేల ఓపీలు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాడేరు (paderu)లో 500 కోట్లతోనూ, కురుపాంలో 600 కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయనీ.. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలలో, ఐదింటిని ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది పాడేరులో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నామన్నారు. మరో 300 పడకల ఆస్పత్రిని కూడా అభివృద్ధి చేస్తామనీ మంత్రి తెలిపారు.
అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా..
విశాఖ కేజీహెచ్ స్థాయిలో అన్ని రకాల ఆరోగ్య సదుపాయాలు గిరిజన ప్రాంతంలోకే వీలయినంత త్వరలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు మంత్రి తెలియజేశారు. అల్లూరి జిల్లా (Alluri district)ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం వలన అధికారులు మరింత ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై క్షేత్ర స్థాయిలో ఏకాగ్రతతో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించినా.. మొదటి ప్రాధాన్యత అల్లూరి జిల్లా (Alluri district)కు ఇస్తున్నామని మంత్రి రజిని వ్యాఖ్యనించారు. అరకు ప్రాంత చల్లని వాతావరణం తనను ఎంతో ఆహ్లాద పరచిందనీ, ఇలాంటి స్వచ్చమైన వాతావరణంలో చక్కగా చదువుకొని ఏ రంగంలోనైనా రాణించటానికి అవకాశం కలుగుతుందని మంత్రి రజిని అన్నారు. గిరిజనుల అభివృద్దే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న జగనన్న, ఈ ప్రాంతంలో లక్ష 50 వేల ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారని స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు.
స్క్రీనింగ్ టెస్ట్‌లు వేగవంతంగా ..
తాను చిన్నతనంలో "మన్యానికి జ్వరం వచ్చింది" అనే వార్తలు చదివే దానిననీ, ఇప్పుడైతే "మన్యానికి ఆరోగ్యం వచ్చింది" అని చదువుకోవలసి ఉంటుందని ఆరోగ్య మంత్రి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనులను దోచుకోవాలని ప్రయత్నం చేసిందని.. అయితే జగనన్న ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ 97ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎంత ఖర్చైనా రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 53,200 డాక్టర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో గుర్తించిన 20 లక్షల మంది సికిలి సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు పాడేరులో స్క్రీనింగ్ టెస్ట్‌లు వేగవంతంగా జరుగుతున్నాయనీ, వారికి స్టయిఫండ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు. అలాగే రాష్ట్రంలో టీబీ సంపూర్ణ నిరోదానికి ఆరోగ్య శాఖ సంపూర్ణ కృషి చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య కిట్లను మంత్రి పంపిణీ చేశారు.