మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి.. నిజమేనా..!

మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూమిని మంత్రి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. భూ రికార్డుల్లో తమపేర్లు లేకుండా చేశారని వారు ఆరోపించారు. తమ భూమిని తమకు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

New Update
మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి.. నిజమేనా..!

ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డికి కొత్త తలనొప్పి పట్టుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి తన భూమిని ఆక్రమించారని దయాసాగర్ రెడ్డి, ‌మర్రి వెంకట్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలోని మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజికి సమీపంలో ఉన్న సుంకరి కుటుంబానికి దాదాపు 9 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో తాము 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు దయాసాగర్ రెడ్డి, ‌మర్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కానీ తాము కొనుగోలు చేసిన భూమిలో రెండు ఎకరాల భూమి మంత్రి మల్లారెడ్డి ఆయన భార్య పేరు మీద కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు చూపిస్తున్నారన్నారు.

తమకు భూమి అమ్మిన వారు మాత్రం తాము ఇంకెవ్వరికీ ల్యాండ్‌ అమ్మలేదని చెప్పినట్లు వారు తెలిపారు. మంత్రి భూములను కబ్జా చేస్తూ ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. అంతే కాకుండా మంత్రి అక్కడ ఉన్న 9 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తున్నారన్నారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లారెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి సైతం తమపై దాడి చేయించారని, అంతే కాకుండా కాల్చి చంపుతామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు భూ రికార్డుల్లో తమ పేర్లు లేకుండా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 కోట్ల రూపాయలు విలువ చేసే తమ ల్యాండ్‌ను మల్లారెడ్డి కొట్టెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని బాధితులు కోరారు.

కాగా దీనిపై స్పందించిన మంత్రి నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరి భూమిని లాక్కోలేదన్న ఆయన.. ఇతరుల భూమిని లాక్కునే అవసరం తనకేంటన్నారు. ఒకవేళ భూమి కావాలనుకుంటే కొనేక్కుంటా అని తెలిపారు. ఎన్నికల సమయంలో తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారినిపై పోలీస్‌ స్టేషన్‌లో న్యాయ బద్దంగా తేల్చుకుంటానని మంత్రి వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు