KTR Fires on Congress Leaders: నోటిఫికేషన్ తేదీ నుంచి ఎన్నికల వరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ఆపేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ (Congress) పార్టీ వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు బంధు పథకాన్ని (Rythu Bandhu Scheme) ఆపి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆరోపిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రైతు బంధు నిధులను ఇంకా ముందుగానే ఇవ్వాలని కోరుతున్నామని వివరణ ఇస్తున్నారు. ఒక వేళ కేసీఆర్ (CM KCR) చెల్లింపులు చేయకపోతే.. నెల రోజుల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఎకరాకు రూ.15 వేలు.. పింఛన్ రూ.4 వేలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: TPCC press meet- ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం ఈ అంశంపై స్పందించారు. చివరికి మంచి నీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంట్ కూడా ఆపెయ్యమంటారేమో? అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ఈ పని ద్వారా ఆ పార్టీ అంటేనే... రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని ధ్వజమెత్తారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు.
పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరన్నారు. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే కూడా ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారని దుమ్మెత్తిపోశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: భగ్గుమంటున్న బండి సంజయ్.. బీజేపీలో అసలేం జరుగుతోంది?