Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం ఉదయానికి తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుండగా, సోమవారం నాలుగో తేదీ సాయంత్రానికి మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం నెల్లూరుకు 650 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, తర్వాత దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా కదులనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు చిత్తూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మూడో తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీసే నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అకౌంట్‌లోకి రూ. 10 లక్షలు.. సంచలన విషయాలు వెల్లడించిన బర్రెలక్క
తీవ్రత భారీగా ఉండొచ్చని అంచనా:
తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని కోస్తా జిల్లాలపైనా తుపాను ప్రభావం చూపనుంది. తీర ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. తుపాను తీవ్రత అంచనాలకు మించి ఉండవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. మూడురోజులూ భారీ వర్షాలు కురవొచ్చు.