Jagadeka Veerudu Athiloka Sundari: అభిమాన వర్షంలో తడిసి ముద్దయి పోవడం అనడం విని ఉంటారు. కానీ.. ఆ అనుభూతిని రియల్ గా చూసిన వారు మాత్రం కచ్చితంగా ఎవరూ ఉండరు అని కూడా అందరూ అనుకుంటారు. అలా మీరు కూడా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ అనుభవాన్ని కళ్లారా చూశారు. కాకపోతే కొద్దిగా రివర్స్ గా అంటే, అభిమానులు వర్షంలో తడిసిపోతూ తన సినిమాని మురిపెంగా చూశారు. ఒక పక్క వర్షం.. మరో పక్క వరదలు.. కొన్ని చోట్ల హెలీకాఫ్టర్లలో ఆహార పొట్లాలు ఇస్తున్న పరిస్థితి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారు? ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి? వరదలు ఎప్పుడు పోతాయి అని.. కానీ, మెగా అభిమానులు మాత్రం తమ చిరంజీవి సినిమా చూడాలని తడిసి ముద్దయిపోయారు. తడుస్తూనే థియేటర్ల ముందు క్యూ కట్టారు. ఒక్కోచోట నీళ్లలో మునిగిన సినిమా హాలులోనే సినిమా చూశారు. ఆ సినిమా పేరు జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari).
తెలుగు ప్రజలు సినిమాని ప్రేమిస్తారని అందరికీ తెలుసు. కానీ, సినిమా కోసం ఎంతకైనా తెగిస్తారని మాత్రం ఆరోజే అర్ధం అయింది ప్రపంచానికి. ఆరోజు మే 9, 1990. జగదేకవీరుడు.. అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) రిలీజయిన రోజు. అంతకు రెండు రోజుల ముందు నుంచి తెలుగునాట వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తుపాను.. తీవ్రత పెరిగిపోయింది. సరిగ్గా సినిమా రిలీజు రోజు చాలా చోట్ల ఊళ్లు మునిగిపోయాయి. వరద నీటి ధాటికి రైలు బ్రిడ్జీలు కూలిపోయాయి. విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను కలిపే రైలు, రోడ్డు బ్రిడ్జీలు కకావికలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. కానీ, చిరంజీవి సినిమా వసూళ్లు మాత్రం ఆగలేదు. కొన్ని చోట్ల భారీ వర్షాలతో సినిమా(Jagadeka Veerudu Athiloka Sundari) ఉదయం ఆటలు పడలేదు. అయినా.. మెగా అభిమానులు వర్షంలో తడుస్తూ మాట్నీ షో వరకూ అలానే నిలుచున్నారు. సినిమా చూసి కానీ, వెనక్కి తిరగలేదు. సినిమా విడుదలయ్యాకా.. టాక్ వచ్చాకా.. సినిమాకి ఆ రేంజ్ క్రేజ్ రావడం వేరు.. సినిమా విడుదల కాకుండానే సినిమా సూపర్ హిట్ చేసిన సంఘటన బహుశా తెలుగు సినీ చరిత్రలో అదొక్కటేనేమో. ఇదంతా ఎందుకంటే.. రేపటికి (మే 9) జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయి సరిగ్గా 34 ఏళ్ళు. ఈ సందర్భంగా సినిమా గురించి కొన్ని విశేషాలు మనం పంచుకుందాం.
చిరంజీవి సుప్రీం స్టార్ గా ఉన్నరోజులవి. అప్పటికే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది. తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు చిరంజీవి. వీరి కాంబినేషన్ కు శ్రీదేవిని జతచేస్తూ వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మాతగా సిద్ధం అయ్యారు. ఈ కంబోనే సంచలనంగా మారింది.
Jagadeka Veerudu Athiloka Sundari: ముందు వజ్రాలవేట పేరుతో సినిమా మొదలైంది. వజ్రాల దొంగతనం నేపధ్యం అని అనుకున్నారు. షూట్ కూడా మొదలైంది. కానీ, చిరంజీవికి, అశ్వనీదత్ కి, రాఘవేంద్రరావుకు ఎక్కడో తేడా కొట్టింది. మళ్ళీ పునరాలోచన చేశారు.
ఈసారి వారి మధ్యలో తళుక్కున మెరిసింది జగదేకవీరుడు అతిలోకసుందరి.. థాట్.. వెంటనే దానిని పట్టాలు ఎక్కించేశారు. సినిమా కథను డెవలప్ చేసేపని యండమూరి వీరేంద్రనాధ్ కి అప్పచెప్పారు. ఇంకేముంది.. వారి ఆలోచనలను తెరరూపం తేవడానికి సరిపడే కథనం రెడీ అయిపోయింది.
Jagadeka Veerudu Athiloka Sundari: ఇంద్రుడి కుమార్తె.. ఉంగరం పోగొట్టుకుని దానిని వెతుక్కుంటూ రావడం.. ఇది మొదటి లైన్. ఇక్కడ అంతరిక్ష కేంద్రం వారు చంద్రుని మీదకు ఒక మిషన్ కోసం ఎవరినైనా పంపించాలని.. అలా వెళ్లిన వారికీ కోట్ల రూపాయలు ఇవ్స్తామని ప్రకటన.. ఒక చిన్న పాప ప్రాణం కాపాడటానికి లక్షల రూపాయల అవసరం చిరంజీవికి. దీంతో చంద్ర మండల యాత్రకు రెడీ అవుతాడు చిరంజీవి.. ఇదీ రెండో లైన్.. ఈ రెండు లైన్లను కలుపుతూ సినిమా. అంతా బావుంది అని అనుకున్నారు. కానీ, చిరంజీవి మాత్రం ఇదేదో తేడాగా ఉందని అన్నారట. చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవు అని చిరుకి అనిపించింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు కూడా ఇదే భావించి జంధ్యాలని రంగంలోకి దింపారు. ‘ఆయన హీరో… మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లి వచ్చినట్టు పెడదాం అని చెబితే ఆ పాయింట్ ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు. మాటలు కూడా ఆయనే రాశారు.
Also Read: సినిమాల్లోకి కష్టంగా పవన్ కళ్యాణ్.. సంచలన నిజాలు బయటపెట్టిన చిరంజీవి!
సరిగ్గా 70 రోజుల్లో సినిమా(Jagadeka Veerudu Athiloka Sundari) షూటింగ్ పూర్తి అయిపొయింది. 9 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా సిద్ధం అయింది. టెక్నాలజీ లేని రోజుల్లో అద్భుతంగా సినిమా వచ్చింది. సరిగ్గా రిలీజ్ డేట్ సమయానికి ఆంధ్ర రాష్ట్రం వర్గాల్లో తడిసి ముద్దవుతోంది.. వరదల్లో ఊళ్లు మునిగిపోయాయి. ఇక సినిమా పని కూడా అయిపొయింది అనుకున్నారు అంతా.. కానీ, ప్రజలు మాత్రం సినిమా రిలీజ్ రోజు నుంచే సినిమాకి ఊపు తెచ్చేశారు. సినిమా అప్పట్లో ఎంత హిట్ అంటే..
44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ.. రూ.15కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇంకొక విషయం ఏమిటంటే.. సినిమా(Jagadeka Veerudu Athiloka Sundari) కోసం చిరంజీవికి 35 లక్షల రెమ్యునరేషన్ ఇస్తే.. శ్రీదేవికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట అశ్వనీదత్. ఒక ఇంటర్వ్యూలో ఈవిషయాన్ని ఆయనే చెప్పారు. ఆ సినిమా సమయానికి శ్రీదేవికి విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్. దీంతో అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికి తెలుగు సినిమాకి అంత ఎక్కువ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కావడం విశేషం.
అదండీ సంగతి.. గ్రాఫిక్స్ మాయలు.. పాన్ ఇండియా ప్రచారాలు లేని రోజుల్లో.. ముఖ్యంగా మొబైల్ ఫోన్.. యూట్యూబ్ రివ్యూల హంగామా లేని పిరియడ్ లో.. వర్షాలు.. వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఒక సినిమా ఆ రేంజ్ లో హిట్ అయింది అంటే, అది నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. ఈ సినిమాకి సీక్వెల్ చేయడం కోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరుత రామ్ చరణ్.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ లతో దీనికి సీక్వెన్స్ రావాలని మెగాస్టార్ కూడా బలంగా కోరుకుంటున్నారు. చూడాలి మరి సీక్వెన్స్ వస్తే ఎంత సంచలనం సృష్టిస్తుందో!