/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Gajvel-Mahankali-who-appeared-in-Chandika-Alankaram-jpg.webp)
Gajwel Mahankali Devi: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 6వ రోజు గజ్వేల్ మహంకాళి అమ్మవారు చండికా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గోపూజ చండీ హవనము, చతుషష్టి ఉపచార పూజ, కుంకుమార్చనలు నిత్యాన్నదానం నిర్వహించడం జరిగింది. అలాగే మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సరస్వతీ పూజలు చిన్నారులచే నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్‌రావు, ఆలయ కమిటీ ధర్మకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండగా ఆలయ ప్రధాన అర్చకులు చాడ నందబాలశర్మ నేతృత్వంలో వైదిక నిర్వహణ కొనసాగుతున్నది.
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకం
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చాడ నందబాలశర్మ మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారిని చండిక అలంకారంలో పూజించడం జరిగిందని తెలిపారు. చండిక అలంకారంలో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో చిన్నారులచే సరస్వతి పూజ అక్షరాభ్యాసం చేయించామన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు అలాగే శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకతగా చెప్పుకుంటారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని పూజిస్తే కష్టాలు తొలగి అంతా మంచి జరుగుతుందని అర్చకులు నందబాలశర్మ తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాల్వ శ్రీధర్‌రావు సభ్యులు శంకరయ్య గుప్తా, మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఆలయంలోని ఆమ్మవారు సుమారు వెయ్యి సంవత్సరాల కిందట నుంచి ఇక్కడ కొలువ తీరారని తెలిపారు. ఆనాటి కాలంలో ఉగాది, దసరా పండుగల సమయంలో మాత్రమే అమ్మవారు గ్రామ దేవతగా కొలిచేవారని ఆయల అధికారులు తెలిపారు. తర్వాత భక్తుల సహకారంతో నూతన ఆలయం నిర్మించగా.. ఆలయంలో మహాలక్ష్మి సరస్వతి సమేతంగా మహంకాళి అమ్మవారిని ప్రతిష్టించారు. మహంకాళి అమ్మవారికి అనేక రకాల ఉత్సవాలు, పూజలు, వ్రతాలు చేస్తూనే ఉన్నామని ఆర్చకులు తెలిపారు. అమ్మవారి మహిమ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎంతగానో తెలుసు.. వాళ్ళ కోరికలు తీరిన తరువాత అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు బలం, బలగం, సౌభాగ్యం ఏర్పడతాయని అర్చకులు అన్నారు. దసరా తర్వాత మంగళవారం అమ్మవారికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మూలా నక్షత్రం కారణంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందరికీ అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సందడితో మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. భక్తి శ్రద్ధలతో ఆట,పాటలతో ఆలయం కనుల పండుగగా మారింది.
ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ