మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో భారీ చోరీ

గాంధీనగర్‌లో నివసించే మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి శామ్యూల్‌ ప్రసాద్‌ సరెళ్ల ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో నగర శివార్లలో పని చేసే ఓ ఎస్సై అనుమానితుడిగా మారాడు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు సదరు పోలీస్ పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

New Update
మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో భారీ చోరీ

Massive theft at former IRS officers house

భూమి కొనుగోలు చేస్తానంటూ బాధితుడికి పరిచయమైన నిందితుడు సురేందర్‌ నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు. శామ్యూల్‌కు మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పాటు విలువైన పత్రాలు తస్కరించాడు. పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భూమి కొంటానంటూ..

ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన ఐఆర్‌ఎస్‌ అధికారి శామ్యూల్‌ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. విశాఖపట్నంలో ఆయన సోదరికి చెందిన ఐదెకరాల భూమి కొంటానంటూ నిజాంపేటకు చెందిన సురేందర్‌ అతడిని సంప్రదించాడు. తనకు అనేక స్థిరాస్తులు ఉన్నాయని, ఇటీవలే నర్సాపూర్‌లో ఐదెకరాల భూమి విక్రయించినట్లు చెప్పాడు. ఆ నగదుతోనే విశాఖలో భూమి ఖరీదు చేస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో శామ్యూల్‌ గత నెల 19న రాజమండ్రిలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లి ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ తీసుకువచ్చి సురేందర్‌కు చూపాడు. దాదాపు 15 రోజుల పాటు సురేందర్‌ ప్రతి రోజూ శామ్యూల్‌ ఇంటికి రాకపోకలు సాగించి నమ్మకం పెంచుకున్నాడు.

ఇడ్లిలో మత్తు మందు

శామ్యూల్‌ ఇంట్లో మెదక్‌ జిల్లాకు చెందిన మహిళ పని చేసేది. ఇటీవల ఆనారోగ్యానికి గురైన ఆమె తన స్వస్థలానికి వెళ్లింది. ఈ విషయం గుర్తించిన సురేందర్‌ గత నెల 30న తన పథకాన్ని అమలు చేశాడు. ఆ సమయంలో శామ్యూల్‌ ఇంటికి వెళ్లిన ఇతగాడు మరోసారి ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ చూపించమన్నాడు. దీంతో ఆయన తన అల్మారా తాళం తీసి వాటిని బయటికి తీసుకువచ్చాడు. హాల్‌లో కూర్చు న్న శామ్యూల్‌కు సురేందర్‌ తాను తీసుకువచ్చిన టిఫిక్‌, కొబ్బరినీళ్లు ఇచ్చాడు. కొబ్బరినీళ్ళు తాగిన కొద్దిసేపటికే శామ్యూల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అదే అదునుగా భావించిన సురేందర్‌ అల్మారాలో ఉన్న రూ.5 లక్షల నగదు, 30 తులాల బంగారు నగలు, 970 గ్రాముల వెండి సామాన్లతో పాటు వివిధ స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు తస్కరించాడు. దాదాపు 15 గంటల పాటు ఇంట్లోనే పడి ఉన్న శామ్యూల్‌ నగరంలో ఉన్న తన మరో సోదరి ఫోన్లకు స్పందించలేదు. దీంతో 31న ఈయన ఇంటికి వచ్చిన ఆమె ఆస్పత్రికి తరలించారు.

ఆధారాలు చూపాలి

ఈ నెల 7వ తేదీ వరకు ఆస్పత్రిలో చికిత్స పొందిన శామ్యూల్‌ కోలుకున్నాడు. ఆపై ఇంటికి వెళ్లి తన అల్మారాలో చూడగా... సురేందర్‌ చోరీ చేసినట్లు గుర్తించి ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 14న కేసు నమోదైంది. గతంలో అతడితో కలిసి రాజమండ్రి వెళ్లినప్పుడూ తనకు మత్తు ఇచ్చి రూ.60 వేలు తస్కరించాడని, 20 ఏళ్లుగా ఫార్మారంగంలో పని చేస్తున్న సురేందర్‌కు మత్తు మందులపై పట్టు ఉందని శామ్యూల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సురేందర్‌ను అరెస్టు చేశారు. అతడి విచారణలో నగర శివార్లలోని ఓ ఠాణాలో పని చేస్తున్న ఎస్సై ఆలోచన మేరకే తాను ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు సదరు ఎస్సైని ప్రశ్నించాలని భావించారు. అయితే ఓ దొంగ చెప్పిన విషయాలు ఎలా నమ్ముతారని, తన ప్రమేయంపై ఆధారాలు చూపాలని సదరు ఎస్సై ఎదురు ప్రశ్నించాడు. దీంతో ఈ విషయం గోప్యంగా ఉంచిన పోలీసులు ఎస్సై ప్రమేయాన్ని నిర్ధారించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు