Fire Accident: గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో ఓ పసుపు కోల్డ్ స్టోరేజీలో(Cold Storege) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో(Short Circut) గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అదుపులోనికి రావడం లేదు.
భారీగా ఆస్తి నష్టం..
మంటలు అధికంగా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వివరిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుగ్గిరాల శుభం మహేశ్వరి పసుపు కోల్డ్ స్టోరేజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దట్టంగా పొగ..
ఇప్పటికీ మంటలు ఎగిసిపడుతూ అదుపులోనికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్న మరికొన్ని ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టంగా పొగ వ్యాపించడంతో ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని తెలుస్తుంది.
స్టోరేజ్ కు మంటలు నాలుగు వైపులా ఎగిసిపడుతున్నాయి. విజయవాడ నుంచి మరో రెండు ఫైరింజన్లను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. స్టోరేజ్ లోపల కొన్ని వేల పసుపు బస్తాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: అయోధ్య బాల రాముని విగ్రహం పై దశావతారాలు!