Holiday for schools: హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా వరుణుడు వీరవిహారం చేస్తుండడంతో పలు స్కూల్స్(schools) కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్కూల్స్‌కి రావద్దని మెసేజీలు పెడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే వాన దంచికొడుతుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు దాపరించాయి. ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లడానికి నిద్రలేచిన విద్యార్థులు.. వారిని రెడీ చేయడానికి సిద్ధమైన తల్లిదండ్రులు బయట కురుస్తోన్న వర్షం చూసి షాక్ అయ్యారు. ఇవాళ స్కూల్ ఉండదులే అని భావించారు. కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు అప్పటికే 'వర్షం వల్ల స్కూల్‌కి హాలీడే' అని మెసేజులు పంపగా.. మిగిలిన స్కూల్స్ మాత్రం చోద్యం చూస్తున్నాయి. నగరంలో ఉదయం నాలుగు గంటల నుంచే వాన కమ్మేస్తున్నా.. అది సాయంత్రం వరకు ఇలానే ఉంటుందని హెచ్చరికలు ఉన్నా హాలీడే ప్రకటించకుండా తల్లిదండ్రులను టెన్షన్ పెడుతున్నాయి. చాలా స్కూల్స్ మాత్రం బాధ్యతవహించి ముందుగానే సెలవు ప్రకటించాయి.
హైదరాబాద్‌కి రెడ్ అలెర్ట్:
నగరవ్యాప్తంగా కుండపోత కొనసాగుతుండడంతో హైదరాబాద్‌కి రెడ్ అలెర్ట్(Red alert) జారీ చేశారు అధికారులు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుయని చెప్పారు. ప్రస్తుతం ఎగువ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న తెలిపారు.
ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తెలంగాణ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్ పశ్చిమ భాగం, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు.
దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇంతే:
తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెబీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్భుల్లాపూర్, బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతూనే ఉంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ వాన భయంకరంగా పడుతోంది. ఇక భారీ వర్షానికి ఇప్పటికే ప్రాజెక్టులు నిండుగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ ఫ్లో 1లక్ష 14 వేల క్యూసెక్కులు ఉండగా.. 26 గేట ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఔట్ ఫ్లో-ఒక లక్ష 14 వేల క్యూసెక్కులగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1090.8 అడుగులగా ఉంది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 89 టిఎంసీలగా ఉంది.
ALSO READ: నగరం అంతటా కుంభవృష్టి..బయటకు రాలేకపోతున్న ప్రజలు!