Mangalagiri : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) కోలాహలం ముగిసింది. ప్రజల తీర్పు ఈవీఎం (EVM) లలో భద్రంగా ఉంది. ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో తెలియడానికి జూన్ 4 వరకూ ఆగాల్సిందే. థ్రిల్లర్ సినిమా రేంజ్ లో సాగిన ఏపీ ఎన్నికల కథ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఎన్నికల తరువాత పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఎన్నికల కమిషన్ (Election Commission) జోక్యంతో మెలమెల్లగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది. ఎన్నికల అనంతర హింస తరువాత.. ప్రజల్లో ఎవరు గెలుస్తారు? అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు అవి పీక్స్ కు చేరుకున్నాయి. మరోపక్క పార్టీల గెలుపోటములపై కోట్లాది రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Mangalagiri Elections : ఏపీ ఎన్నికల్లో ఫోకస్ అంతా ఇప్పుడు పిఠాపురం పైనే ఉంది. బెట్టింగ్స్.. చర్చలు.. సోషల్ మీడియాలో అంచనాలు.. నేతల మధ్య జరుగుతున్న వాదనలు.. టీవీ షో ల్లో డిబేట్స్ ఇలా ఒక్కటనేమిటి పిఠాపురం-పవన్ కళ్యాణ్ ఇదే అంశం హైలైట్ అవుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికల జరిగినా.. జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పోటీ చేస్తున్న పులివెందుల కానీ, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పోటీ చేస్తున్న కుప్పం కానీ.. రాజధాని రైతుల నియోజకవర్గం మంగళగిరి కానీ.. కొడాలి నాని, రోజా, బొత్స వంటి నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కానీ అసలు చర్చల్లో వినిపించడం లేదు. అటు అధికార పక్షం ఫోకస్ అంతా పిఠాపురం పైనే. ఇటు కూటమి కూడా పిఠాపురానికే ప్రాధాన్యం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి పిఠాపురం తరువాత కీలక నియోజకవర్గంగా మంగళగిరిని చెప్పుకోవాలి. కానీ, ఇక్కడ అంతా సైలెన్స్ గా ఉంది. తుపాను ముందరి ప్రశాంతతలా పెద్దగా చర్చలు.. వాదనలు లేకుండా చప్పుడు లేకుండా ఉంది.
నిజానికి ఎన్నికల ముందు ఎక్కువ ఆసక్తి కలిగించిన స్థానాల్లో మంగళగిరి కూడా ఒకటి. నిజానికి ఇక్కడ గెలుపు ఇప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ కూటమికి, అటు అధికార వైసీపీ చాలా కీలకం. ఎందుకంటే, అమరావతి రాజధాని ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. దీంతో ఇది చాలా ఆసక్తికరమైన.. రాజకీయంగా ప్రాధాన్యత ఎక్కువ ఉన్న నియోజవర్గంగా నిలిచింది. వైసీపీ మూడు రాజధానుల రాగం నేపథ్యంలో ఇక్కడ అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పుకున్నారు. దీంతో మంగళగిరిలో ఏమి జరుగుతుంది అనే ఆసక్తి ఎన్నికల ముందు చాలా ఎక్కువగా కనిపించింది.
అయితే, ఎన్నికలు అయిపోయిన తరువాతా మంగళగిరి గురించి ఎక్కడా ఏమీ వినపడటం లేదు. అటు వైసీపీ నేతలు.. ఇటు కూటమి నాయకులూ ఎవరూ కూడా మంగళగిరి గురించి మాత్రం ఎక్కడా మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు. ఈ సైలెన్స్ వెనకాల వైలెంట్ రిజల్ట్ వస్తుందనే భయం అధికార వైసీపీలో ఉందా? అనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా వైసీపీ నాయకులు అస్సలు నోరుమూసుకుని ఉండలేరు. అందులోనూ రాజధాని విషయంలో ఎప్పుడూ ఎదో ఒక మాట అంటూనే ఉంటారు. అటువంటిది ఎన్నికలు ముగిసిన తరువాత వారి నుంచి చడీ.. చప్పుడూ లేదు. రాజధాని అనే కాదు ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ బరిలో ఉన్నారు.
రెండోసారి కసిగా..
Mangalagiri Elections: మంగళగిరి లో లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీచేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆయన వేరే స్థానానికి మారతారని చెప్పుకున్నారు. కానీ, లోకేష్ ఏమాత్రం తగ్గలేదు. పోయిన చోటే వెతుక్కోవాలని అనుకున్నారేమో.. మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. నిజానికి మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో టీడీపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1983లో ఒకాసారి, 1985లో ఒకసారి కోటేశ్వరరావు ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. అయితే, తరువాత ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయిస్తూ వచ్చింది. దాదాపు 35 ఏళ్ల తరువాత 2014లో ఇక్కడ టీడీపీ పోటీ చేసింది. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గానికి పట్టు ఎక్కువ. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అప్పుడు బరిలో దింపింది. అయితే, ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలాంటి నియోజకవర్గాన్ని లోకేష్ 2019లో ఎంచుకున్నారు. పట్టుదలగా ప్రయత్నించారు. కానీ ఆర్కే చేతిలో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదీ గతం. ఏదిఏమైనా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలని లోకేష్ పట్టుదలతో నిలబడ్డారు. ప్రచారం కూడా అదేవిధంగా ఆమీ.. తూమీ అన్నారు నిర్వహించారు.
వైసీపీ పిల్లి మొగ్గలు..
Mangalagiri Elections: ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళకు టికెట్ ఇచ్చేది అనుమానమే అనే లీక్స్ ఇచ్చింది వైసీపీ. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఇక్కడ టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన గంజి చిరంజీవిని ఇంఛార్జ్ గా జగన్ ప్రకటించారు. కానీ, ఏమైందో ఏమో.. ఆర్కే కాంగ్రెస్ నుంచి యూ టర్న్ తీసుకుని వైసీపీలోకి వచ్చి చేరారు. ఆయన వచ్చిసిన వెంటనే చిరంజీవిని పక్కన పెట్టి.. మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది వైసీపీ. ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. మాజీ మంత్రి అయిన మురుగుడు హనుమంతరావు కుమారుడి భార్య. అటుతిరిగి.. ఇటు తిరిగి. సరైన అభ్యర్థిని ఎంచుకోలేదని స్థానిక వైసీపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం జరిగింది.
లోకేష్ కి అంత ఈజీ కాదు..
Mangalagiri Elections: ఇక్కడ గెలుపు లోకేష్ కి అంత ఈజీ కాదు అనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే, ఇక్కడ బలమైన సామాజిక వర్గం పద్మశాలీలు. మురుగుడు లావణ్య ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. అదే వైసీపీ బలంగా నమ్మింది. దీంతో ఇక్కడ లోకేష్ ప్రచారం గట్టిగా చేసుకుంటూ వచ్చారు. అధికార పార్టీపై వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న సానుభూతి, మరీ ముఖ్యంగా రాజధాని విషయంలో ఈ ప్రాంతానికి వైసీపీ చేసిన అన్యాయం ఆయుధాలుగా లోకేష్ ప్రచారం సాగించారు. ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్థి తరఫున ఆళ్ళ తన వంతు ప్రచారం గట్టిగానే చేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలలో ఒకటిగా నిలిచింది.
Also Read: వైసీపీ నుంచి కీలక నేత ఎంఆర్‌సీ రెడ్డి బహిష్కరణ!
ఎందుకీ సైలెన్స్..
Mangalagiri Elections: ఎన్నికలు అయిపోయాయి. ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం కూడా గతం కంటే ఏక్కువగానే రికార్డ్ అయింది. ఇప్పుడు ఇక్కడ గెలుపు ఎవరిది అనేది తేలాల్సి ఉంది. పోలింగ్ తరువాత నారా లోకేష్ కుటుంబంతో అమెరికా వెళ్లారు. దీంతో అక్కడ తెలుగుదేశం తరపున ఎన్నికల సరళి గురించి కానీ.. తమ అభిప్రాయాలను కానీ చెప్పలేదు. అటు వైసీపీ కూడా మౌనంగానే ఉండిపోయింది. మరోవైపు టీడీపీ కూటమి వైపు నుంచి కూడా మంగళగిరిపై సైలెన్స్ ధోరణే కనిపిస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరిదీ అనే విషయంలో పార్టీల మౌనంతో మరింత టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇక్కడి ప్రజల్లోనూ ఆ టెన్షన్ సైలెంట్ మోడ్ లోనే కనిపిస్తుంది.