Loan App Harassment : ఈ మధ్య చాలా మంది యువత ఆర్ధిక సహాయం కోసం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ , లోన్ యాప్స్ (Loan Apps) వంటి సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫార్మ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ లోన్ యాప్స్ తీసుకున్న డబ్బులు తిరిగి కట్టలేక కొంతమంది ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేకే మంచిర్యాల జిల్లా (Mancherial District) లో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు.
ప్రాణం తీసిన లోన్ యాప్
శ్రీరాంపూర్ అరుణాక్కర్‌నగర్‌కు చెందిన నమ్తాబాజీ శ్రీకాంత్(29) అనే యువకుడు మంచిర్యాలలో సెల్ పాయింట్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ళుగా శ్రీకాంత్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్నాడు. మొదట్లో మంచి లాభాలు వచ్చాయి. దాంతో అలాగే ట్రేడింగ్ చేస్తూ వచ్చాడు. కానీ ఆ తర్వాత మెల్లి మెల్లిగా నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఓ లోన్ యాప్ ద్వారా శ్రీకాంత్ రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా కట్టడం ఆలస్యం చేయడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన శ్రీకాంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాధను సెల్ఫీ వీడియోలో వివరించి.. అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.