Bhatti Vikramarka: తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ మేరకు ఆలయంలో ప్రమాణం చేసి రూ. 100 స్టాంప్ పై సంతకం చేసి మరీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేసిన భట్టి హామీల అమలు బాధ్యత తమదేనన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు షాక్.. ఈసీ నోటీసులు
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ఉంటుందన్నారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో ప్రజల సమక్షంలో ఆయన దేవాలయంలో కాంగ్రెస్ గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని స్టాంప్ పేపర్ పై సంతకం చేసి ప్రమాణం చేశారు. ప్రజల్లో రోజురోజుకూ కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతోందన్నారు. ఎన్నికల అనంతరం అత్యధిక సంఖ్యలో సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
తాను మధిర నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీయేనని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.