Malla Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాత్రం టికెట్ వచ్చినా తన కుమారుడు కోసం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించక ముందే తిరుమలలో మంత్రి హరీష్‌రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసి సంచలనం రేపారు. అనంతరం పరిణామాలతో కుమారుడు టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో బలమైన మైనంపల్లిని ఢీకొట్టే మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే మల్కాజిగిరి అసెంబ్లీ బరిలో గులాబీ పార్టీ తరపున మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీకి దిగనున్నారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఆయన అభ్యర్ధిత్వం ఖరారైపోయింది. ఈ క్రమంలోనే మల్లారెడ్డి తన అల్లుడుతో కలిసి మల్కాజ్‌గిరిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మాట్లాడిన మల్లారెడ్డి.. మైనంపల్లికి సవాల్ విసిరారు. నియోజకవర్గానికి రాముడొచ్చాడు.. రావణసురుడిని కాల్చివేస్తాం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మల్లన్న. మైనంపల్లిపై లక్ష ఓట్ల మెజార్టీతో తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఇటు మైనంపల్లి.. అటు మల్లారెడ్డి ఇద్దరు ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు కావడంతో ఈసారి మల్కాజ్‌గిరి పోరు రసవత్తరంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు మైనంపల్లి రాకను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 27న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌తో కలిసి మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తనకు మల్కాజిగిరి, తన కొడుకు రోహిత్‌కు మెదక్ సీట్ల ఒప్పందంతోనే ఆయన హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటూ మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. తండ్రికొడుకులకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకున్నాకే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.