Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయన కొడుకును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయనకు నోటీసులు అందాయి. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళగిరి డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానున్నారు.
చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు ఎందుకు వెళ్లారు?, దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అని జోగి రమేష్ ను మంగళగిరి డీఎస్పీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారు?, మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అనే దానిపై జోగి రమేష్ ను విచారించనున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.
ఈ వ్యవహరంలో జోగి రమేష్ తనయుడు తోపాటు భూముల కొనుగోలు చేసిన వారిని, భూములు అమ్ముటకు సహకరించిన ప్రభుత్వ అధికారుల పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు లో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల తోపాటు దేవినేని అవినాష్, నందిగామ సురేష్.