MLA Pannala Shakya: ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటును కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గుణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్యా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. కానీ..మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఏమీ ఉపయోగముండదు. అందుకని మీకో సలహా ఇవ్వాలనుకుంటున్నా... డిగ్రీలకు బదులుగా జీవనోపాధి కోసం కనీసం మోటార్ సైకిల్ పంక్చర్ రిపేర్ దుకాణాలను తెరుచుకోండి. అది మీకు బాగా ఉపయోగపడుతుంది అని అన్నారు. అంతేకాదు తాను చెప్పింది కచ్చింతగా గుర్తుంచుకోండి అని కూడా చెప్పారు షాక్యా. ఈయన మాటలకు అక్కడున్న వారతా ఒక్కసారి షాకయ్యారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి...అది కూడా ఒక కాలేజ్ ఓపెనింగ్ లాంటి దానికి వచ్చి ఇలాంటి సలహాలివ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న కాలుష్యం మీద షాక్యా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే స్థానికంగా 11 లక్షల మొక్కలు నాటి ఇందౌర్ గిన్నిస్ రికార్డు సృష్టించారు కానీ తరువాత వాటిని ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.
పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఇండోర్‌లో వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్రమంత్రి అమిత్ షా. బట్టీ చదువుల ద్వారా స్కోరు పెరిగినా విద్యార్థుల్లో నైపుణ్యాలు అభివృద్ధి చెందడం అసాధ్యం అన్నారు.కొత్త విద్యా విధానం కింద ఏర్పాటు చేసిన పీఎం ఎక్స్‌లెన్స్‌లతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.